నసురుల్లాబాద్: న్యూ ఇయర్ వేడుకల్లో ఇరు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది. వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రూపొందించిన ఆడియో సాంగ్‌ను ఆపాలని బీఆర్‌ఎస్ కార్యకర్తలు.. ఆపొద్దంటూ కాంగ్రెస్ నేతలు పట్టుబట్టడం.. ఘర్షణకు దారితీయడంతో ఆపేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు బీరుసీసాతో ఛాతీపై కొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో జరిగింది. మృతుడు కాంగ్రెస్ నాయకుడు, 45 ఏళ్ల సాదుల రాములు!
గ్రామస్థులు, మృతుడి భార్య వివరాల ప్రకారం.. నాచుపల్లిలో ఆదివారం అర్ధరాత్రి కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి. రేవంత్‌రెడ్డిపై రూపొందించిన పాట పెట్టుకుని గ్రామానికి చెందిన యువకులు డ్యాన్స్ చేశారు. అక్కడికి బీఆర్‌ఎస్ కార్యకర్తలు కీసర రవి, కొంగల అనిల్, కొంగల వినోద్, గోపాల్ వెళ్లి ఆ పాటను ఆపేసి.. బీఆర్‌ఎస్ పాటలను పెట్టాలని వారికి చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకుని రేవంత్ పాటను ఆపొద్దని చెప్పడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య గొడవ మొదలైంది. విషయం తెలుసుకున్న సాదుల రాములు అక్కడికి వెళ్లారు. రెండు పార్టీల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు బీరు సీసాతో రాములు ఛాతీపై కొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్ పటేల్ సోమవారం ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు.
రాములును హత్యచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించొద్దంటూ అడ్డుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ జగన్నాథ్‌రెడ్డి మృతుడి కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలతో మాట్లాడారు. న్యాయం చేస్తామంటూ ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాములుకు భార్య సుజాత, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామానికి చెందిన కీసర రవి, కొంగల అనిల్, కొంగల వినోద్, గోపాల్ కలిసి పథకం ప్రకారం తన భర్తను చంపారని, దీని వెనుక గ్రామ పీఏసీఎస్ చైర్మన్ చలసాని సుధీర్ ప్రోద్బలం ఉందని సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొడవను ఆపేందుకు వెళ్లిన తన భర్త రాములును చంపేస్తామని బెదిరించారని.. ఆ తర్వాత ప్రాథమిక పాఠశాల వద్ద అడ్డుకొని బూతులు తిడుతూ ఛాతీపై దాడి చేసి చంపారని ఆమె ఆరోపించారు.