Sunday, September 8, 2024
spot_img
HomeSPORTSనిఖత్‌, శ్రీజకు అర్జున ఖరారు

నిఖత్‌, శ్రీజకు అర్జున ఖరారు

న్యూఢిల్లీ: ఈ ఏడాదికిగాను క్రీడా అవార్డులను అధికారికంగా ప్రకటించారు. సెలెక్షన్‌ కమిటీ ప్రతిపాదించిన జాబితాకే క్రీడాశాఖ సోమవారం ఆమోదముద్ర వేసింది. టేబుల్‌ టెన్నిస్‌ లెజెండ్‌ ఆచంట శరత్‌ కమల్‌ను అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న వరించింది. చెన్నైకి చెందిన 40 ఏళ్ల శరత్‌ కమల్‌.. లేటు వయసులోనూ యువ ఆటగాళ్లకు దీటుగా ఆడుతూ అంతర్జాతీయస్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నాడు. ఈ ఏడాది బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో మూడు స్వర్ణాలు, ఓ రజతంతో మొత్తం నాలుగు పతకాలు సాధించి ఖేల్‌రత్నకు ఎంపికయ్యాడు. ఇక మొత్తం 25 మందికి అర్జున అవార్డులను ప్రకటించగా.. వీరిలో ఇద్దరు తెలుగు స్టార్లు నిఖత్‌ జరీన్‌, ఆకుల శ్రీజ ఉండడం విశేషం. నిజామాబాద్‌కు చెందిన 26 ఏళ్ల నిఖత్‌.. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షి్‌పతో పాటు కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గి భారత నెంబర్‌వన్‌ బాక్సర్‌గా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల శ్రీజ.. కొన్నాళ్లుగా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. కామన్వెల్త్‌ క్రీడల్లో శరత్‌ కమల్‌తో కలిసి మిక్స్‌డ్‌ విభాగంలో పసిడి పతకం నెగ్గింది. బ్యాడ్మింటన్‌ స్టార్లు హెచ్‌ఎస్‌ ప్రణయ్‌, లక్ష్యసేన్‌ అర్జున అందుకోనున్న వారిలో ఉన్నారు. ఈనెల 30న రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులు అందజేయనున్నారు. అర్జున పురస్కారాల కేటగిరిలో ఈమారు ఒక్క క్రికెటర్‌ కూడా లేకపోవడం గమనార్హం.

మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న: ఆచంట శరత్‌కమల్‌

అర్జున: నిఖత్‌ జరీన్‌, అమిత్‌ (బాక్సింగ్‌), ఆకుల శ్రీజ (టీటీ), సీమా పూనియా, ఎల్డోస్‌ పాల్‌, అవినాష్‌ సబ్లే (అథ్లెటిక్స్‌), లక్ష్యసేన్‌, ప్రణయ్‌ (బ్యాడ్మింటన్‌), భక్తి కులకర్ణి, ప్రజ్ఞానంద (చెస్‌), దీప్‌గ్రేస్‌ ఎక్కా, (హాకీ), సుశీలా దేవి (జూడో), సాక్షి కుమారి (కబడ్డీ), నయన్‌ మోని సైకియా (లాన్‌బౌల్స్‌), సాగర్‌ కైలాస్‌ (మల్లఖాంబ్‌), ఎలవెనిల్‌, ఓం ప్రకాశ్‌ (షూటింగ్‌), వికాస్‌ ఠాకూర్‌ (వెయిట్‌లిఫ్టింగ్‌), అన్షు, సరిత (రెజ్లింగ్‌), ప్రవీణ్‌ (వుషు), మానసి జోషి, తరుణ్‌ ధిల్లాన్‌ (పారా బ్యాడ్మింటన్‌), స్వప్నిల్‌ పాటిల్‌ (పారా స్విమ్మింగ్‌), జెర్లిన్‌ అనిక (డెఫ్‌ బ్యాడ్మింటన్‌).

ద్రోణాచార్య: జీవన్‌జ్యోత్‌ సింగ్‌ (ఆర్చరీ), మహ్మద్‌ అలీ ఖమర్‌ (బాక్సింగ్‌), సుమ సిద్దార్థ్‌ షిరూర్‌ (పారా షూటింగ్‌), సుజిత్‌ మాన్‌ (రెజ్లింగ్‌).

లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌: దినేశ్‌ జవహర్‌ లాడ్‌ (క్రికెట్‌), బిమల్‌ ప్రఫుల్లా ఘోష్‌ (ఫుట్‌బాల్‌), రాజ్‌సింగ్‌ (రెజ్లింగ్‌), అశ్విని అకుంజి (అథ్లెటిక్స్‌), ధరమ్‌వీర్‌ సింగ్‌ (హాకీ), బీసీ సురేష్‌ (కబడ్డీ), నీర బహదూర్‌ గురుంగ్‌ (పారా అథ్లెటిక్స్‌).

రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌: ట్రాన్స్‌స్టేడియా ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, కళింగ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీ, లడఖ్‌ స్కీ అండ్‌ స్నోబోర్డ్‌ అసోసియేషన్‌.

మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ ట్రోఫీ: గురునానక్‌ దేవ్‌

యూనివర్సిటీ (అమృత్‌సర్‌).

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments