హైదరాబాద్/దుండిగల్: ఓ క్యాబ్ డోర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ప్రాణాన్ని బలిదీసుకుంది. డ్రైవర్ ముందు, వెనకా చూడకుండా నిర్లక్ష్యంగా డోర్ తెరవడంతో బైక్‌పై వస్తున్న తండ్రీకుమారులు డోర్ తగిలి కిందపడ్డారు. అదే సమయంలో వెనకనుంచి వచ్చిన టిప్పర్ తండ్రి మీదుగా వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ప్రగతినగర్ రోడ్డులో ఆదివారం జరిగింది. బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ పట్టణానికి చెందిన పెంటయ్య (45) ప్రభుత్వ టీచర్. ఆదివారం మధ్యాహ్నం ప్రగతినగర్ నుంచి కొండాపూర్‌కు కుమారుడితో కలిసి బైక్‌పై వెళ్లాడు.
మార్గ మధ్యలో ఓ క్యాబ్ డ్రైవర్ వెనకా ముందు చూడకుండా నిర్లక్ష్యంగా కారు డోర్‌ను తెరవడంతో బైక్‌పైఉన్న వారికి తగిలింది. తండ్రీకుమారులిద్దరూ కిందపడ్డారు. అదే సమయంలో వెనకనుంచి వేగంగా వస్తున్న టిప్పర్ పెంటయ్య మీదినుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా పెంటయ్య అక్కడ మృతి చెందాడు. కుమారుడు శ్రీసాయి చరణ్ చికిత్స పొందుతున్నాడు. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు. క్యాబ్, టిప్పర్ డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు