లైంగిక దోపిడీకి పాల్పడిన కేసులో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. 2013లో కేరళలో చాందీ ముఖ్యమంత్రిగా ఉండగా రూ.వేల కోట్ల విలువైన సోలార్ విద్యుత్ కుంభకోణం వెలుగుచూసింది. ఈ వ్యవహారంలో అరెస్టు అయిన ఓ మహిళ.. చాందీ సహా కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలపై తీవ్రమైన లైంగిక ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనం రేగింది. ఈ నేపథ్యంలో బుధవారం తిరువనంతపురంలోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు సీబీఐ నివేదిక అందించింది. ప్రధాన నిందితురాలు.. చాందీపై చేసిన ఆరోపణల్లో పస లేదని సీబీఐ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.