రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేవలం టిఆర్ఎస్ నేతల కోసమే పని చేస్తారా లేక యావత్తు తెలంగాణ కోసం నియమింపబడ్డారా అనేది అర్థం కావడం లేదని కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండి తాజుద్దీన్, టిపిసిసి కార్యదర్శి సమద్ నవాబ్ లు ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మైనారిటీలకు సంబంధించినటువంటి పలు సమస్యలపై మెమోరాండం ఇద్దామని మైనారిటీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వద్దకు వెళితే మెమోరాండం తీసుకోకుండా మొహం చాటేసారని ఆరోపించారు. మీ లోకల్ మంత్రి గంగుల కమలాకర్ ను కలిసి అడగాలని కొప్పుల ఈశ్వర్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా తమకు ఉచిత సలహా ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. తాము ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళమా కాదా అని మైనారిటీ సంక్షేమ శాఖమంత్రిగా తమకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కొప్పుల ఈశ్వర్ కు ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీలో ముస్లిం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉండగా మైనారిటీలపై అసలే అవగాహన లేని కొప్పుల ఈశ్వర్ కు మైనారిటీ మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ హయాంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా మహమ్మద్ అలీ షబ్బీర్ పనిచేశారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల మనోభావాలతో ఆటలాడుకుంటుందని విమర్శించారు. ఇది మైనారిటీల మనోభావాలు దెబ్బతీయడమేనని అభివర్ణించారు. ముస్లిం బందు మొదటి విడత లోన్లు కేవలం బీఆర్ఎస్, ఎంఐఎం నాయకులకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు కు జ్యూడిషియల్ అధికారం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, విద్యార్థులకు స్కాలర్షిప్పు, ప్రతి జిల్లాకు మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ ఉర్దూ స్టడీ సర్కిల్, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, ఇమామ్ మౌజన్లకు జీతాలు, ఇలా ఎన్నో సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా ముస్లింలపై చిన్న చూపు చూస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ముస్లింల సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారో..దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలని కొప్పుల ఈశ్వర్ కు సవాల్ విసిరారు. ముస్లిం బందు అందరికీ ఇవ్వకుంటే మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.