‘రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అభివృద్థి పనులు ఎందుకు చేపట్టడం లేదు? కొన్ని జిల్లాల్లో టెండర్లు కూడా ఎందుకు పూర్తి చేయలేదు? పని చేయడం ఇష్టం లేకపోతే రాతపూర్వకంగా ఇచ్చి తప్పుకోండి’ అని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి నగరంలోని హజ్‌హౌ్‌సలో జిల్లాల మైనార్టీ సంక్షేమ అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోను మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని, దీనికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. కేవలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల జిల్లా ధర్మపురిలో మాత్రమే పనులు పూర్తయ్యాయని, అన్ని జిల్లాల్లో త్వరిత గతిన పనులు పూర్తి చేయాలన్నారు. అంతే కాకుండా మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ వసతి గృహలను జిల్లా అధికారులు తనిఖీ చేస్తూ… విమర్శలకు తావివ్వకుండా చూడాలన్నారు.