చెన్నై: అన్నాడీఎంకే బలహీనపడినప్పుడల్లా ఆ పార్టీకి ఊపిరిపోసింది తామేనని పీఎంకేకు చెందిన సీనియర్ న్యాయవాది బాలు పేర్కొన్నారు. పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రాందాస్ ఎంపీ కావడానికి తానే కారణమంటూ అన్నాడీఎంకే నాయకుడు, మాజీ మంత్రి డి.జయకుమార్ చేసిన విమర్శలపై బాలు కౌంటర్ ఇచ్చారు. పాత సంగతులను గుర్తుకు తెచ్చుకుని తమ పార్టీపై ఆచితూచి విమర్శలు చేయాలని హితవు పలికారు. హైకోర్టు ప్రాంగణం వద్ద మంగళవారం ఉదయం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అన్బుమణి ఇటీవల పార్టీ సమావేశంలో మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, అదే సమయంలో అన్నాడీఎంకే నాలుగువర్గాలుగా చీలిపోవడం విచారకరమన్నారని, ఆ మాటలకే మాజీ మంత్రి జయకుమార్ రెచ్చిపోయి పీఎంకేపై దుమ్మెత్తిపోశారన్నారు. అన్నాడీఎంకేలో చీలికలు అందరికీ తెలిసిన విషయమేనని, కానీ జయకుమార్ పనిగట్టుకుని అన్బుమణి ఎంపీ కావడానికి తానే కారణమని, 1988లో తమ కూటమిలో చేరటం వల్లే ఆ పార్టీ ఎదిగిందంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని బాలు విమర్శించారు. అన్బుమణి ఎంపీగా గెలవడానికి జయకుమార్ ఎలా కారణమవుతారని, ఎన్నికల పొత్తులో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఎంపీ సీటును పీఎంకేకే కేటాయించారని, అక్కడ అన్బుమణిని పోటీకి దింపాలని పీఎంకే నిర్ణయించిందే తప్ప మరెవరూ కారన్నారు. మాజీ మంత్రి జయకుమార్ కాస్త పాత సంగతులను గుర్తుకు తెచ్చుకోవడం మంచిందని, 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే, పీఎంకేకు అసెంబ్లీలో నలుగురు సభ్యులే ఉండేవారని, ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత పీఎంకేతో పొత్తుకుదుర్చుకోవడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారన్నారు. అన్నాడీఎంకే బలహీనపడినప్పుడల్లా ఆ పార్టీకి ఊపిరిపోసిందీ పీఎంకే అని మరచిపోకూడదని హితవు పలికారు.. అదే విధంగా 2001లో పీఎంకేతో పొత్తు కోసం జయలలిత ఎదురుచూశారని, వీటన్నింటిని గుర్తు చేసి పీఎంకే ఎన్నడూ తమ వల్లే అన్నాడీఎంకే గెలిచిందని గొప్పలు చెప్పుకోలేదని బాలు స్సష్టం చేశారు. పీఎంకే వల్లే జయలలిత, ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యారంటూ తామెన్నడూ ప్రకటించలేదన్నారు. ఈ వాస్తవాలను గుర్తుపెట్టుకుని పీఎంకేపై విమర్శలు చేసేటప్పుడు జయకుమార్ ఆచితూచి వ్యవహరించాలని బాలు హితవు పలికారు.