రోజురోజుకు ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ముస్తాబాద్ మండలంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న కానిస్టేబుల్ పై దాడికి పాల్పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన యువతీ యువకుడు ప్రేమ వివాహం చేసుకొని కుటుంబ సభ్యుల అంగీకారం ఉంటుందో లేదో అనే అనుమానంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందగా గూడెం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముస్తాబాద్ ఎస్సై ఆధ్వర్యంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. అదే సమయంలో అర్ధరాత్రి పూట ఐదు ట్రాక్టర్లు అక్రమఇసుక రవాణా చేస్తున్న క్రమంలో అక్కడ పోలీస్ బందోబస్తులో ఉన్న బ్లూ కోర్టు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఐదు ఇసుక ట్రాక్టర్లను బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ సత్యనారాయణకు తారాసపడగా ఇట్టి విషయం పికెటింగ్ లో అక్కడే ఉన్న ముస్తాబాద్ ఎస్సై కి సమాచారం ఇవ్వగా ట్రాక్టర్ల వద్దకు వచ్చిన ఎస్ఐ బ్లూ కోర్ట్ కానిస్టేబుల్ సత్యనారాయణను అక్రమ రవాణా చేస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తీసుకురావాలని చెప్పినట్లు సమాచారం. ఎస్సై ఆదేశాల మేరకు సదర్ కానిస్టేబుల్ ట్రాక్టర్ పై కూర్చోగా ట్రాక్టర్ డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే నామాపూర్ శివారుకు రాగానే ట్రాక్టర్ తో సహా చెరువులో దింపి తను దూకేశాడని సమాచారం. దీంతో సత్యనారాయణ అనే కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు కాగా అతనిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ తగినంత చికిత్స అందించకపోవడంతో అక్కడి నుండి కరీంనగర్ కు, కరీంనగర్ నుండి హైదరాబాదుకు తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం ట్రాక్టర్ డ్రైవర్ పరార్ లో ఉన్నట్లు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఇసుక బకాసురులపై కఠిన చర్యలు తీసుకునేలా పలు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

