మహిళలు అన్ని రంగాలలో రాణించాలని బాలవికాస స్వచ్చంద సేవా సంస్థ జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన అన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారంలో బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారని ఈ తరుణంలో మహిళా లోకం మరింత శక్తి వంచన లేకుండా కృషిచేసి దానిని రూపుమాపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె అన్నారు. పాలక ప్రభుత్వాలు కార్మిక చట్టాలను సవరించి పురుషులతోపాటు మహిళలకు సమాన వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని మహిళా సాధికారత కాగితాలకే పరిమితం కాకుండా చూడాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలపై ఉందని మహిళలు నిజమైన అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వాలు అనువైన పరిస్థితులు కల్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బాలవికాస జమ్మికుంట మండల కో ఆర్డినేటర్లు సుమలత, స్వాతి, బాలవికాస సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.