హైదరాబాద్: డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీష్‌రావు, ప్రశాంత్‌రెడ్డికి కేసీఆర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం ఉంది. తెలంగాణపై ప్రధాని మోదీ సర్కార్ వైఖరిపై చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆంక్షల వల్ల రాష్ట్రం.. రూ.40 వేల కోట్ల ఆదాయం కోల్పోయిందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇదే అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రాన్ని ఎండగట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఈడీ, ఐటీ దాడులను సమావేశాల్లో కేసీఆర్ ఎండగట్టే అవకాశం ఉంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం తమ అధీనంలోని దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలో వరుస దాడులతో బెంబేలెత్తిస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఎదురుదాడికి సిద్ధమవుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను లక్ష్యంగా చేసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో పనిచేసే అవినీతి నిరోధక బృందాన్ని (ఏసీబీని) ఇందుకు అస్త్రంగా వాడుకోనుంది. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం అందినా, ఎవరి నుంచైనా లంచం డిమాండ్ చేసినట్లుగానీ, లంచం తీసుకున్నట్లుగానీ ఫిర్యాదులు అందినా.. ఆ ఉద్యోగులపై అవినీతి నిరోధక చట్టం కింద నేరుగా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టనుంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం రాష్ట్ర ఏసీబీకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు పెట్టేందుకు అవకాశం ఉండటంతో.. దాని ఆధారంగా ఎదురుదాడికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.