రెండు పార్టీలకు 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు?
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పొత్తుల విషయంలో ఆయా పార్టీలు.. దోస్త్ మేరా దోస్త్ అంటూ రాజకీయ రాగాలు తీస్తున్నాయి. ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ చేరిక దాదాపు ఖరారైంది. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఫైనల్ అయినా.. సీట్లపై మాత్రం కుస్తీ కొనసాగుతోంది. అమిత్ షా పిలుపు కోసం చంద్రబాబు నాయుడు ఎదురుచూస్తున్నారు.. పిలుపు రాగానే.. పొత్తులు ఫైనల్ కానున్నాయి. కాగా.. రెండు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ ఢిల్లీలోనే ఉన్నారు. పొత్తు ఖరారు అయినప్పటికీ.. సీట్ల షేరింగ్ ఎలా అనేదానిపై మొన్న రాత్రి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే.. నిన్న మరోసారి చర్చలు జరుగుతాయి అనుకున్నారు కానీ.. సాధ్యపడలేదు. అమిత్‌షా వేరే రాష్ట్రాల పర్యటనలతో బిజీగా ఉండటంతో ఏపీ నేతలతో భేటీ కాలేకపోయారు. ఇవాళ ఉదయం 11 గంటలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో అమిత్‌షా భేటీ అయ్యే అవకాశం ఉంది. బిహార్ పర్యటనకు బయల్దేరేలోపే ఇద్దరు నేతలతో భేటీ అయ్యి సీట్ల షేరింగ్‌పై చర్చించనున్నారు.
బీజేపీ-జనసేన పార్టీలకు 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అమిత్‌షాతో ప్రస్తావించే అవకాశం ఉంది. భేటీ తర్వాత ముగ్గురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సీట్ షేరింగ్ ఫార్ములా ఎలా ఉండబోతోంది అనేదే ఆసక్తికరంగా మారింది.
అయితే, రెండు పార్టీలకు 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలు? ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.. ఈ 30 అసెంబ్లీ సీట్లలోనే జనసేన, బీజేపీ షేరింగ్ తోపాటు.. పోటీచేసే స్థానాలపై చర్చ జరుగుతోంది. అయితే, లోక్‌సభ స్థానాల విషయంలో సర్దుకుపోయేందుకు టీడీపీ, జనసేన సిద్ధమైనట్లు కూడా తెలుస్తోంది.
త్వరలోనే ఉమ్మడి ప్రకటన..
ఇదిలా ఉంటే.. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే ఉమ్మడి ప్రకటన చేస్తాన్నారు. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయని.. బీజేపీతో పొత్తుపై ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయన్నారు. జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామి.. అని.. బీజేపీతో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయంటూ వివరించారు. ఏపీలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయే అంటూ అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు.