ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా టికెట్ల పంపకాలు నేతల్లో చిచ్చు పెడుతున్నాయి. విజయవాడ ఎంపీ సీటు తనకు రాదని తేలిపోవడంతో టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్న కేశినేని నాని.. తన ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా వైసీపీ అధిష్టానానికి కొన్ని షరతులు కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది. వీటికి అధిష్టానం అంగీకరిస్తే ఆయన రేపే పార్టీలో అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే టీడీపీకి గుడ్ బై చెప్పేయాలని నిర్ణయించుకున్న కేశినేని నాని.. తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించడం లాంఛనమే. ఇప్పటికే తన కుమార్తె కేశినేని శ్వేతతో కార్పోరేటర్ పదవికి రాజీనామా చేయించిన కేశినేని.. ఇప్పుడు తాను కూడా రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకూలిస్తే రేపు కేశినేని ఫ్యామిలీతో పాటు వైసీపీలో చేరినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు
అయితే వైసీపీలో చేరికకు కేశినేని నాని ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తన ఎంపీ సీటుకు గ్యారంటీ ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్ కాగా.. మరో ఐదు ఎమ్మెల్యే సీట్లు కూడా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఇన్నాళ్లూ తనను నమ్ముకుని ఉన్న ఐదుగురికి ఎమ్మెల్యే టికెట్లు తప్పనిసరిగా ఇప్పించుకోవాలన కేశినేని పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.
వైసీపీలో చేరేందుకు తనతోపాటు మరో 5 అసెంబ్లీ సీట్ల కోరిన కేశినేని నాని…వాటిపై అధిష్టానం దూతలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేత, విజయవాడ పశ్చిమ నుండి ఎమ్మెస్ బేగ్, నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు నాని టికెట్లు కోరుతున్నారు. అయితే వీటిలో ఎంపీ సీటుతో పాటు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఖరారు చేసేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.