మనిషి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. అలాంటి వాటిల్లో అప్పులు అనేవి కూడా ఒకటి. ముఖ్యంగా పంటలు పండించే రైతులు అప్పుల బాధతో నరకం అనుభవిస్తుంటారు. పంటల కోసం చేసిన రుణం తీర్చలేక కొందరు ఆస్తులను అమ్ముతున్నారు. మరికొందరు ఆ ఆస్తులు కూడా లేకా, అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఓ రైతు మాత్రం అప్పుల నుంచి బయట పడేందుకు ఓ అతి తెలివిని చూపించాడు. చివరకు పోలీసులకు దొరకడంతో అతడి కథ అడ్డం తిరిగింది.
ప్రకాశం జిల్లా యర్రగొండపాల్లె నియోజవర్గంలో ఓ రైతు అప్పుల బాధ నుంచి బయట పడేందుకు అడ్డదారి తొక్కాడు. యర్రగొండపాలెం మండలం గంగుపల్లెకి చెందిన కేశనపల్లి బ్రహ్మయ్య అనే రైతుకు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఐదు ఎకరాల భూమి ఉంది. ఇందులో వివిధ రకాల పంటలు పండిస్తూ కుటుంబాన్న పోషిస్తున్నాడు. అయితే బ్రహ్మయ్య పండించిన పంటలో దిగుబడులు సరిగా రాలేదు. దీంతో పంటల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోయాయి. అలానే అప్పు ఇచ్చిన వారు కూడా తీర్చాలంటూ ఒత్తిళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అప్పులను ఎలాగైనా తీర్చాలని బ్రహ్మయ్య ఆలోచించాడు.
ఈ క్రమంలో గంజాయి పంట గురించి తెలుసుకున్నాడు. కొందరు సాధువుల నుంచి గంజాయి విత్తనాలు సేకరించాడు. వాటిని తాను పండిస్తున్న కంది చేనులో నాటారు. ఎరువులు వేయడంతో అవి 6 అడుగుల ఎత్తు వరకు ఏపుగా పెరిగాయి. ఈ విషయం అటుఇటు తిరిగి చివరకు పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న సెబ్ పోలీసులు బ్రహ్మయ్య పొలంలో తనిఖీలు చేపట్టారు. మొత్తం 282 వరకు గంజాయి మొక్కలున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే వాటిని కంది చేనులో నుంచి తొలగించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 3 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడు బ్రహ్మయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
పోలీసులు మాట్లాడుతూ తమకు అందిన సమాచారం ప్రకారం గంగుపల్లిలోని పలు పొలాల్లో తనిఖీలు చేశామని, 359/2 సర్వే నంబరు పొలంలోని కంది పంట మధ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించామన్నారు. గుర్తించిన 282 గంజాయి మొక్కల విలువ దాదాపు రూ.3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి సాగుచేసినా, విక్రయించినా, అదేవిధంగా అక్రమంగా మద్యం నిల్వ ఉంచి, వాటిని అమ్మినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మొత్తంగా అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు రైతు వేసిన ప్లాన్ అండం తిరిగి.. చివరకు జైలు పాలయ్యాడు.