జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ గా విశేష సేవలు అందించి గ్రామీణ ప్రజల్లో సైతం మంచి అవగాహన పెంపొందించుకున్న వ్యక్తి సమ్మిరెడ్డి అని ఐటి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం స్థానిక హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తో జమ్మికుంట పట్టణంలో గల ఎంపీఆర్ గార్డెన్స్ లో దశదిన కర్మకు హాజరై వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సిద్ధాంత పరంగా కాంగ్రెస్ నమ్ముకున్న వ్యక్తి సమ్మిరెడ్డి అని, మాజీ మంత్రి ఎమ్మెస్సార్ శిష్యుడిగా కాంగ్రెస్ లో కొనసాగాడని ఇలా అకస్మాత్తుగా మరణించడం బాధాకరమని భౌతికంగా దూరమైన ఆయన ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. సమ్మిరెడ్డి అనుభవాలను పార్టీ వినియోగించుకునే లోపే ఆయన మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. అనంతరం మారుతినగర్ లోని గట్టయ్య నివాసానికి వెళ్లారు. ఈ కార్యక్రమములో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.