కెనడియన్ సాయుధ దళాలు(CAF).. తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. కెనడాలోని విదేశీ పౌరులకు మిలటరీలో చేరే అవకాశం కల్పించింది. శాశ్వత నివాస హోదా కలిగిన విదేశీ పౌరులు.. Canadian Armed Forcesలో చేరవచ్చని ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలో అక్కడ నివసిస్తున్న భారతీయులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కెనడాలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలోనే కెనడా ప్రభుత్వం తమ దేశంలోకి భారీ స్థాయిలో వలసలను ప్రోత్సహిస్తోంది.
గత ఏడాది కెనడా చరిత్రలోనే అత్యధికంగా నాలుగు లక్షల మందికి శాశ్వత నివాస హోదా కల్పించింది. ఈ నేపథ్యంలో దాదాపు లక్ష మంది భారతీయులు కెనడాలో శాశ్వత నివాస హోదా లభించింది. అంతేకాకుండా 2022-24 మధ్య సుమారు 10లక్షల కంటే ఎక్కువ మంది విదేశీ పౌరులకు శాశ్వత నివాస హోదా కల్పించాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే శాశ్వత నివాస హోదా కలిగిన విదేశీయులకు మిలటరీలో చేరే అవకాశాన్ని Canadian Armed Forces కల్పించింది. CAF నిర్ణయంతో ఇప్పటికే కెనడాలో స్థిరపడ్డ (శాశ్వత నివాస హోదా పొందిన) భారతీయులకు లబ్ధి చేకూరనుంది.
ఇదిలా ఉంటే.. రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(RCMP) ఇప్పటికే పర్మినెంట్ రెసిడెంట్లకు పోలీస్ ఫోర్స్‌లో చేరే అవకాశం కల్పించింది. 10ఏళ్లుగా కెనడాలోనే నివాసం ఉంటూ శాశ్వత నివాస హోదా కల్గిన విదేశీ పౌరులను RCMPలో చేరొచ్చని ప్రకటించింది.