కొలంబో: శ్రీలంక యువక్రికెటర్, బౌలింగ్ ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నేకు షాకింగ్ పరిణామం ఎదురైంది. శ్రీలంక క్రికెట్ (SLC) ప్లేయర్ అగ్రిమెంట్ నిబంధనలు అతిక్రమించిన అతడిపై ఒక ఏడాది సస్పెన్షన్ వేటుపడింది. ఈ సస్పెన్షన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వర్తిస్తుందని తెలిపింది. నేషనల్ కాంట్రాక్ట్ ప్లేయర్‌గా కరుణరత్నే నిబంధనల ఉల్లంఘించాడనే ఆరోపణలపై ముగ్గురు సభ్యుల కమిటీ దర్యాప్తు జరిపిందని, ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక క్రికెట్ స్పష్టం చేసింది. కాగా టీ20 వరల్డ్ కప్ సమయంలో ఓ క్యాసినోలో జరిగిన ఘర్షణలో కరుణరత్నే ఉన్నాడని ఇదివరకే రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. సస్పెషన్ వేటుకు ఈ ఘర్షణే కారణమా, లేక ఇంకేదైనా కారణం ఉందా అనే విషయాన్ని శ్రీలంక క్రికెట్ పేర్కొనలేదు.
అతిక్రమణ తీవ్రతను పరిగణలోకి తీసుకున్న దర్యాప్తు కమిటీ.. ఇతర ఆటగాళ్లు ఈ తరహా చర్యలకు పాల్పడకుండా తీవ్రంగా హెచ్చరించాలంటూ శ్రీలంక క్రికెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ప్రతిపాదన చేసింది. ఇక కరుణరత్నే క్రికెట్ కెరియర్‌పై ప్రభావం పడకుండా చర్యలకు ఉపక్రమించాలని కమిటీ కోరిందని శ్రీలంక క్రికెట్ వెల్లడించింది. ఆధారాలు పరిశీలించిన తర్వాత దర్యాప్తు కమిటీ సిఫార్సుల మేరకు కరుణరత్నేపై ఏడాదిపాటు సస్పెన్షన్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌పైనా ఈ నిషేధం ఉంటుందని శ్రీలంక క్రికెట్ తెలిపింది. అంతేకాకుండా 5000 వేల డాలర్ల జరిమానా కూడా విధించినట్టు తెలిపింది.