న్యూఢిల్లీ: గూగుల్ నుంచి తొలగింపునకు గురైన 12వేల మంది ఉద్యోగుల్లో కొందరు తమకు సీవరెన్స్ ప్యాకేజీ కింద సంస్థ అసలుకన్నా చాలా తక్కువ మొత్తాన్ని లెక్కగట్టడాన్ని మెయిల్‌లో చూసుకొని షాక్ తిన్నారు. కొందరు విషయాన్ని సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. సీవరెన్స్ ప్యాకేజీ పొరపాటుగా మిస్ క్యాలిక్యులేట్ అయినట్లుగా గూగుల్ గుర్తించింది. ఈ మేరకు తొలగింపునకు గురైన ఉద్యోగులకు క్షమాపణలు చెబుతూ మెయిల్ పెట్టింది. ఇటీవల గూగుల్ ప్రపంచవ్యాప్తంగా 12వేల మందిని తొలగించింది. ఏ కారణం వల్లయినా ఉద్యోగులను సంస్థే తొలగిస్తే ఒప్పందం ప్రకారం నోటీస్ పీరియడ్‌కు గానూ వారికి పూర్తి జీతం, సీవరెన్స్ ప్యాకేజీ కింద 4 నెలల పూర్తి జీతం, ఉద్యోగ విరమణ వయసు దాకా ఏటా 2 వారాల జీతాన్ని లెక్కగట్టివ్వాలి. అయితే మాజీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన వాస్తవ ప్యాకేజీ కన్నా సంస్థ 40% తక్కువ లెక్కగట్టినట్లు సమాచారం.