ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంటే.. దానిని చూసి గర్వించకుండా.. మెగా, నందమూరి అభిమానులు.. ‘మా వాడు గొప్పంటే.. మా వాడు గొప్ప’ అంటూ సోషల్ మీడియా వేదికగా గొడవలు పడుతున్నారు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైనప్పటి నుంచి.. ఎన్టీఆర్ పాత్ర విషయంలో ఆయన అభిమానులు నిరాశగానే ఉన్నారు. ఎన్టీఆర్ కంటే చరణ్‌ని బాగా చూపించారని కొందరంటే.. ఎన్టీఆర్ తన నటనతో సినిమా మొత్తం తనవైపు లాగేసుకున్నాడని మరికొందరు.. ఇలా మొదటి నుంచి ఫ్యాన్స్ నుంచి టాక్ వినబడుతూనే ఉంది. కానీ.. ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం ఈ సినిమాతో మా స్నేహబంధం చాలా దగ్గరైందని, మా మధ్య సోదర బంధం ఏర్పడిందని.. ఇద్దరూ ప్రతి స్టేజ్‌పై చెబుతూ వచ్చారు. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న ఇంటర్వ్యూలలో కూడా రామ్ చరణ్ అదే చెబుతున్నారు. సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో ఎన్టీఆర్ కూడా చరణ్ విషయంలో ఇదే చెప్పారు. కానీ వారి అభిమానులు మాత్రం.. వారి మాటకు విలువ ఇవ్వకుండా.. కొందరు (అందరూ కాదు) సోషల్ మీడియాలో లేనిపోని గొడవలను క్రియేట్ చేస్తున్నారు.
తాజాగా అమెరికాలో రామ్ చరణ్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్న నిమిత్తం.. ‘సైడ్ యాక్టర్ ఎన్టీఆర్ జూనియర్’ అని అన్నట్లుగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఓ వాయిస్‌ను వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ని ఇలా అవమానించారేంటి? అనేలా కామెంట్స్ చేస్తున్నారు. ‘టాక్ ఈజీ విత్ సామ్ ఫ్రాగోసో’ పాడ్ కాస్ట్ షోలో రామ్ చరణ్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న హోస్ట్.. ఎన్టీఆర్‌ని ఇలా సంబోధించినట్లుగా చెబుతూ.. ‘ఇది మీ వాడి స్థానం’ అంటూ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆ ఆడియోని వైరల్ చేస్తున్నారు. అయితే.. కేవలం ఆ ఒక్క పదాన్ని కట్ చేసి వారు చేస్తున్న ఆడియోకి బదులిస్తూ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రణరంగంలోకి దిగారు. ‘ఇలా సగం సగం కట్ చేసే బ్రతుకులు మీవి’ అంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు.
వాస్తవానికి ఈ ఆడియోలో ‘ఎలాంగ్ సైడ్, యాక్టర్ ఎన్టీఆర్ జూనియర్’ అని ఉండగా.. ఆడియోలో ‘ఎలాంగ్’ అనేది కట్ చేసి ‘సైడ్ యాక్టర్ ఎన్టీఆర్ జూనియర్’ అని ఉన్న ఆడియోతో చరణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ‘నీతో పాటు నటించిన నటుడు జూనియర్ ఎన్టీఆర్’ అనే అర్థం వచ్చేలా.. అక్కడి హోస్ట్ మాట్లాడితే.. రామ్ చరణ్ ఫ్యాన్స్ అర్థం మార్చేసి హంగామా చేస్తున్నారు. అంతే.. నందమూరి ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రామ్ చరణ్‌ని దూషిస్తూ.. పాత వీడియోలను పోస్ట్ చేస్తూ.. వారు కూడా ఎదురు దాడికి దిగారు. ఇలా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేశారు. ఇదనే కాదు.. ఎన్టీఆర్ హైలెట్ అయిన చోట చరణ్‌ని, చరణ్ హైలెట్ అయిన చోట ఎన్టీఆర్‌ని మెగా, నందమూరి ఫ్యాన్స్ తక్కువ చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి ఇది కావాలనే చేస్తున్నారో.. లేదంటే ఎవరైనా చేయిస్తున్నారో తెలియదు కానీ.. గ్లోబల్ ఇమేజ్‌కి వెళ్లిన ఈ ఇద్దరికీ ఈ వార్స్ డ్యామేజ్‌గా మారుతున్నాయనేది మాత్రం వాస్తవం. మరి ఈ వార్స్‌కి ముగింపు ఎక్కడ? అనేది ఆయా హీరోలకే తెలియాలి.