ఈ వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా, క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం వీర్నపల్లి మండల కేంద్రం, వన్ పల్లి గ్రామాల్లో అదనపు కలెక్టర్ పి.గౌతమి తో కలిసి కలెక్టర్ పర్యటించారు. వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వీర్నపల్లి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో ఇంటింటికీ తిరిగి నీటి సరఫరాలో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ట్యాంకుల ద్వారా ఎంత నీటిని సరఫరా చేస్తున్నారు..? ట్యాంకుల ద్వారా కాకుండా బోరు ద్వారా నీటిని సరఫరా చేయడానికి అవకాశం ఉందా అనే వివరాలను ఆరా తీశారు. అధికారులు స్థానికంగా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అన్నారు.