రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెల్ఫోన్ దొంగతనానికి గురైందని బాధితుని ఫిర్యాదు మేరకు ఓ దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన నూకల సాయి వంశీ అనే వ్యక్తి కడుపునొప్పితో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం రోజు చికిత్స పొందుతున్నాడు. అదే రోజు రాత్రి సుమారు ఎనిమిది గంటల 30 నిమిషాల ప్రాంతంలో 25వేల రూపాయల విలువ గల సెల్ఫోను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని సాయి వంశీకి వరుసకు చిన్న నాన్న అయిన రాకెట్ల పల్లె గ్రామానికి చెందిన మందాటి రాము ఫిర్యాదు మేరకు శనివారం ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ లో వాహన తనిఖీ చేస్తుండగా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు నిఖిల్ ను అదుపులోకి తీసుకొని విచారించగా సెల్ ఫోన్ దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అతనిని అరెస్టు చేసి రిమాండ్ తరలించామని ఎస్ఐ తెలిపారు.


