పెరంబూర్(చెన్నై): ఒక ఆధార్ నెంబరుపై ఎన్ని కనెక్షన్లున్నా, ఆ కనెక్షన్‌లకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి సెంధిల్ బాలాజి స్పష్టం చేశారు. స్థానిక అన్నాసాలైలోని విద్యుత్ బోర్డు కార్యాలయంలో గురువారం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 2.6 కోట్ల మంది వినియోగదారులు తమ విద్యుత్ కనెక్షన్‌తో ఆధార్ నెంబరు అనుసంధానం చేశారని, ఇంకా 67 వేల మంది చేయాల్సి ఉందన్నారు. వారి ఇళ్లకే వెళ్లి ఆధార్ నెంబరు అనుసంధాన పనులు చేపట్టనున్నామని తెలిపారు. ఒకే ఆధార్ నెంబరుతో ఎన్ని కనెక్షన్లున్నా ఇబ్బందులు లేవన్నారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు ప్రభుత్వ ప్రకటనను తప్పుగా అర్ధం చేసుకొని ఒకే ఆధార్ నెంబరుతో ఎక్కువ కనెక్షన్లు కలిగిన వారిని బెదిరిస్తున్నారని వార్తలు వెలువడ్డాయని, అలాంటి అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
డీఎంకే ప్రభుత్వంలో ఒకటిన్నర లక్షలమంది రైతులకు ఉచిత విద్యుత్ అందించామన్నారు. ప్రస్తుతం 18 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి 12 గం టలు మాత్రమే సరఫరా చేసిందని ఆరోపించారు. వచ్చే ఏడాది వేసవి కాలం నుంచి వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ అందించేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో వేసవి కారణంగా విద్యుత్ వినియోగం పెరుగుతుండడంతో మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో తలా 1,565 యూనిట్ల అదనపు విద్యుత్ పొందేందుకు టెండర్లు ఆహ్వానించామన్నారు. రాష్ట్ర అవసరాలు పరిగణలోకి తీసుకొని 2030 సంవత్సరానికల్లా విద్యుదుత్పత్తి రెట్టింపు చేసేలా ప్రాజెక్ట్‌లు అమలుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.