ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారన్న వార్తతో ‘తాడేపల్లి’ తల్లడిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల అడుగుపెడితే జగన్‌కు రెక్కలు ఊడినట్లేనని బెంబేలెత్తుతోంది. ‘జగనన్న బాణం’ తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టుకొని తనపైకే దూసుకొస్తుండటంతో జగన్‌లో తీవ్ర కలవరం మొదలైంది.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారన్న వార్తతో ‘తాడేపల్లి’ తల్లడిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల అడుగుపెడితే జగన్‌కు రెక్కలు ఊడినట్లేనని బెంబేలెత్తుతోంది. ‘జగనన్న బాణం’ తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టుకొని తనపైకే దూసుకొస్తుండటంతో జగన్‌లో తీవ్ర కలవరం మొదలైంది. సోదరి షర్మిల ఏపీ వైపు రాకుండా నచ్చచెప్పడానికి జగన్ రాయబారం పంపినట్టు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేత, బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దించినట్టు సమాచారం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… ఏపీలో జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అది కుటుంబంలో చిచ్చు పెట్టినట్లవుతుందని, అది ఎవరికీ మంచిది కాదని షర్మిలకు సుబ్బారె డ్డి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు తెలిసింది.
‘‘ఇన్నాళ్లూ మేం రోడ్డున పడితే ఎవరు పట్టించుకున్నారు? నాకు అన్యాయం జరిగిందని నెత్తి, నోరు బాదుకుంటే ఆ రోజు మీరెందుకు రాయబారం నడపలేదు? నేను రోడ్డున పడితే మీకు సరదాగా ఉందా? నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ముఖం చూడలేదు కానీ.. ఏపీకి వస్తానంటే రాయబారానికి వచ్చారా? ఏనాడైనా నా తరఫున మాట్లాడారా? నాకు ఊరట కలిగించేలా చేశారా? నేను ఎంతో మానసిక క్షోభ అనుభవించాను. అప్పుడెప్పుడూ లేనిది, ఇప్పుడు జగన్‌కు ఇబ్బంది అవుతుందని నా దగ్గరకు వచ్చారు. ఇదేమి న్యాయం? కుదరదులే. నా ఆలోచనలు నాకున్నాయి. నా మానాన నన్ను బతకనివ్వండి’’ అని ముఖం మీదే షర్మిల కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. అసలు ఈ పరిస్థితుల్లో వచ్చి ఉండకూడదని, తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆమె మండిపడినట్లు సమాచారం. ‘అదేంటమ్మా.. మనమంతా ఒకే కుటుంబం కదా’.. అని సుబ్బారెడ్డి బుజ్జగించే ప్రయత్నం చేయగా… ‘నన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడు కుటుంబంలో నేనూ ఒకరిని అన్న విషయం గుర్తుకులేదా?’ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
గతంలో అంతా తానై..
జగన్ జైలులో ఉన్నప్పుడు, గత ఎన్నికల సమయంలోను ఆయన తరఫున సోదరి షర్మిల విస్తృతంగా ప్రచారం చేశారు. ‘జగనన్న వదిలిన బాణాన్ని’ అని సగర్వంగా చెప్పుకొన్నారు. షర్మిలను ఇన్నాళ్లూ నిర్లక్ష్యం చేసి దూరదూరంగా పెట్టి, అనేక రకాల వేధింపులకు గురి చేసిన జగన్ ఇప్పుడు తన బంధువర్గాన్ని ఆమెపై పురమాయిస్తున్నారు. ఇప్పటికే జగన్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడటం.. పార్టీలో రోజురోజుకూ ధిక్కార స్వరాలు పెరుగుతుండటం.. దీనికితోడు షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడుతున్నారని వార్తలు రావడంతో తాడేపల్లి శిబిరం మరింత ఆందోళన చెందుతోంది. వైసీపీ ప్రేరేపిత సోషల్ మీడియా ఇప్పటికే షర్మిలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టింది. ట్విటర్, ఫేస్‌బుక్ ఖాతాల ద్వారా షర్మిల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పోస్టులు పెడుతున్నారు.