టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీగా తరలి వచ్చిన జనం, కార్యకర్తల ఉత్సాహం మధ్య జరగాల్సిన బహిరంగ సభ… అనూహ్యంగా సంతాప సభగా మారింది. నెల్లూరు జిల్లా కందుకూరులో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో అపశ్రుతి చోటు చేసుకుని… ఎనిమిది మంది మరణించారు. నలుగురు క్షతగాత్రులయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఏం జరిగిందంటే…. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు బుధవారం నెల్లూరు జిల్లాలో మూడు రోజుల పర్యటన మొదలుపెట్టారు. సాయంత్రం కందుకూరుకు చేరుకున్నారు.
భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే వేలాదిమంది అక్కడ గుమికూడారు. నిలబడటానికి కూడా స్థలం లేనంతగా జనం కిక్కిరిశారు. చంద్రబాబు వాహనం అక్కడికి చేరుకోగానే ఆయనను మరింత స్పష్టంగా చూసేందుకు వెనుకవైపున ఉన్న వారు ఎత్తైన ప్రాంతాలపైకి ఎక్కసాగారు. అలాగే కొందరు ఒక వెల్డింగ్ షాప్‌పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. దానిపైకి వెళ్లేందుకు మెట్లు లేకపోవడంతో… ముందువైపున ఉన్న రేకుల షెడ్డుపైకి ఎక్కారు.
మరికొందరు ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాటు చేసిన వాహనంపైనా ఎక్కారు. అది చూసి చంద్రబాబు వారిని అప్రమత్తం చేశారు. ‘తమ్ముళ్లూ… అలా ఎక్కొద్దు. ప్రమాదం.. అంతా వెనక్కు రండి’ అని పలుమార్లు హెచ్చరించారు. కానీ… అంతలోనే ప్రమాదం ముంచుకొచ్చింది. ఒకేసారి ఎక్కువమంది పైకి చేరడంతో… ఆ బరువు తట్టుకోలేక షెడ్డుకు ఉన్న రేకులు విరిగిపోయాయి. దానిపైన ఉన్న వారు అప్పటికే షెడ్డు కింద నిల్చున్న వారిపైన పడ్డారు. వెల్డింగ్ షాప్‌ను ఆనుకుని ఉన్న గుండంకట్ట ఔట్‌లెట్ గట్టు మీద నిలబడి ఉన్న వారిపైనా కొందరు పడ్డారు. ఒకరిమీద మరొకరు పడటంతో కింద ఉన్న వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ హఠాత్పరిమాణంతో చుట్టుపక్కల ఉన్న వారు కూడా భయాందోళనకు గురై అటూఇటూ పరుగులు తీశారు. ఇది తొక్కిసలాటకు దారి తీసింది. తొక్కిసలాటలో కొందరు, కాలువలో పడిన వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు.
హుటాహుటిన ఆసుపత్రికి…
ప్రమాదాన్ని గమనించిన చంద్రబాబు… గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని టీడీపీ నాయకులను ఆదేశించారు. బాధితులను సంఘటన స్థలానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న ఏరియా ఆస్పత్రికి చేతులపైనే మోసుకెళ్లారు. ఆ సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎంత మంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారో కూడా అర్థంకాని పరిస్థితి. ‘ఇంకా ఎవరైనా ఉన్నారేమో చూడండి! వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లండి’ అంటూ వేదికపై నుంచే చంద్రబాబు పదేపదే మైకులో చెప్పారు. తొలుత ఒక్కరు మాత్రమే మరణించారని భావించారు. కానీ… చూస్తుండగానే ఆ సంఖ్య పెరుగుతూ వెళ్లింది.
జేసీ, ఎస్‌పీ పరిశీలన
ప్రమాద విషయం తెలియగానే రాత్రి 10.40 గంటల ప్రాంతంలో జేసీ కూర్మనాథ్, ఎస్‌పీ విజయరావు కందుకూరుకు చేరుకున్నారు. ప్రమాద స్థలిని ఎస్పీ పరిశీలించారు. ఏరియా ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులతో ఇరువురూ మాట్లాడి వివరాలు సేకరించారు. కాగా, రాత్రి 10 గంటల ప్రాంతంలోనే సబ్‌కలెక్టర్ శోభిక ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులతో మాట్లాడారు. డీఎస్పీ కండే శ్రీనివాసులు కూడా అక్కడకు చేరుకుని విచారించారు.
బొబ్బిలి నేతల ఆర్థిక సహాయం
కుటుంబానికి లక్ష ప్రకటించిన శిష్ట్లా లోహిత్
కందుకూరు చంద్రబాబు పర్యటనలో దురదృష్టవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, బొబ్బిలి టీడీపీ ఇన్‌చార్జి బేబినాయన సంయుక్తంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఒక్కొక్క మృతుని కుటుంబానికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే టీడీపీ కార్యకర్తల విభాగం సమన్వయకర్త శిష్ట్లా లోహిత్ ప్రతి కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
మృతులు వీరే!
1) కాకుమాని రాజా (50), కందుకూరు
2) కలవకూరి యానాది (65), కొండముడుసుపాలెం
3) దేవినేని రవీంద్రబాబు (73),
ఉలవపాడు, ఆత్మకూరు మండలం
4) యాటగిరి విజయ (35), ఉలవపాడు
5) ఉచ్చులూరి పురుషోత్తం (56),
గుడ్లూరు మండలం గుళ్లపాలెం
6) మర్లపాటి చినకొండయ్య (55), అమ్మవారిపాలెం
7) గడ్డం మధుబాబు (45),
ఓగూరు, కందూకురు మండలం
8) రాజేశ్వరి (40), కందుకూరు