తమిళనాట ఫైర్ బ్రాండ్ పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్ సోషల్ మీడియా రివ్యూవర్స్‌పై మండిపడ్డారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘కొండ్రల్ పావమ్’. తెలుగులో వచ్చిన ‘అనగనగా ఓ అతిథి’కి రీమేక్ ఇది. త్వరలో ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా వరలక్ష్మీ ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఓ తమిళ మీడియాతో మాట్లాడిన ఆమె సోషల్ మీడియాలో సినిమాలపై రివ్యూ ఇచ్చే వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ ‘‘రివ్యూ చెప్పేవాళ్లకు కనీసం ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి, సినిమా మీద అవగాహన ఉండాలి. ఈ మధ్యన కొత్త సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయో లేదో క్షణాల్లో సోషల్ మీడియాలో సమీక్షలు ఇచ్చేస్తున్నారు. అంతే కాదు టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక వాటిపై కూడా ఇష్టమొచ్చినట్లుగా రివ్యూలు ఇస్తున్నారు. ప్రేక్షకుడిని తప్పుతోవ పట్టిస్తున్నారు. అసలు కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాను జడ్జ్ చేయడానికి వాళ్లు ఎవరు? సినిమాలో ఇది బాగోలేదు.. అది బాగోలేదు అనడానికి వారెవరు? అసలు సినిమాలో ఏమీ లేదు అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లందరిని నేను ఒక్కటే అడుగుతున్నా. అసలు మీరు ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారు’’ అని ప్రశ్నించారు. ‘మొదట్లో సినిమాను వినోదం కోసం చూేసవాళ్లు. ఇప్పుడు ఎంజాయ్ చేయడం మర్చిపోయి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు’’ అని అన్నారు. సోషల్ మీడియా పెరిగిపోవడం దీనికి కారణం. అసలు సినిమా హిట్టా.. ఫ్లాపా అని చెప్పడానికి వాళ్లెవరు. ప్రేక్షకుల నిర్ణయమే ఫైనల్. దయజేసి సినిమా చూసిన ప్రేక్షకుల్ని ఆనందించనివ్వండి. ఇదొక్కటే నా విన్నపం’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.