నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాలు ఎంతగానో దోహద పడతాయనీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానిక ఎస్.ఐ రమాకాంత్ కిషన్ దాస్ పేట ప్రజలకు సూచించారు. కిషన్ దాస్ పేట ప్రజలకు స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్.ఐ రమాకాంత్ అవగాహన కల్పించారు. ఇటీవల శివాలయంలో, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో, సద్ది మద్దుల వారి సేవా సంఘం పక్కన గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వరుసగా జరిగిన దొంగతనాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మీమీ నివాస ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్.ఐ రమాకాంత్ సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. ఎవరైనా మీ ఇండ్లకు తాళాలు వేసి ఊరికి వెళితే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని, ఏదైనా నేరం జరిగితే 100 నంబర్ కు డయల్ చేసి సమాచారం చేరవేయాలని సమావేశానికి హాజరైన ప్రజలకు ఎస్.ఐ సూచించారు.
సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించడానికి సహకరించిన మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ను స్థానిక ఎస్.ఐ రమాకాంత్ అభినందించారు. మహిళలు పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాల అవగాహన కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా హర్షించదగినదని ఎస్.ఐ రమాకాంత్ మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లూ కోర్టు కానిస్టేబుల్ సతీశ్ తో పాటు అంగన్ వాడీ కార్యకర్తలు కవిత, సునీత తో పాటు కిషన్ దాస్ పేట కు చెందిన మహిళా సంఘాల సభ్యులు యూత్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.