కంటోన్మెంట్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం రుద్దుతున్న నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి బోర్డును వెంటనే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే డిమాండ్ తో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గత 4 రోజులుగా చేస్తున్న రిలే నిరహార దీక్షకు భారీ స్పందన కనబడుతుంది. శనివారం 5వ రోజున దీక్షా శిబిరాన్ని నియోజకవర్గంలోని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు తమ ఆశీర్వచనం అందజేసి దీక్షకు సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్నారు. రాజ్యసభ సభ్యులు అనీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ దీక్షా శిబిరానికి వచ్చి శ్రీగణేష్ చేపట్టిన దీక్ష విజయవంతం కావాలని, కంటోన్మెంట్ బోర్డు విలీనం అయ్యేంతవరకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. దీక్షకు సంఘీభావం తెలిపిన అనంతరం నాయకులు మాట్లాడుతూ ఈ నిరాహార దీక్ష శ్రీగణేష్ స్వార్థం కోసం చేయట్లేదని కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి, కేంద్ర కబంద హస్తాల నుంచి విముక్తి కోసమే చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రజల కోసం పోరాడుతుంటే ఈ ప్రాంత ఓట్లతో యంపీ అయిన ఈటెల రాజేందర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కంటోన్మెంట్ ప్రజలు ఇంకెన్నేళ్ళు అభివృద్ధికి దూరంగా ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతుంటే కంటోన్మెంట్ ప్రజలు నగరం మధ్యలో ఉండి కూడా పేదరికంలోనే మగ్గాలా? ప్రజల కనీస అవసరాలైన తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వంటి పనులను కూడా నిధులు లేవని సక్రమంగా చేయలేని కంటోన్మెంట్ బోర్డు మాకెందుకు? యంపీ ఈటెల రాజేందర్ వెంటనే తన బాధ్యతగా కంటోన్మెంట్ బోర్డు విలీనం గురించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి విలీన ప్రక్రియ వెంటనే మొదలయ్యేలా చూడాలన్నారు. రాజ్యసభ సభ్యులు అనీల్ కుమార్ మాట్లాడుతూ కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లి పార్లమెంటులో ప్రస్తావిస్తా అని అన్నారు. అవసరమైతే శ్రీగణేష్ నాయకత్వంలో ఢిల్లీలో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన వారిలో వికాస్ మంచ్, రసూల్ పుర క్రిస్టియన్ చర్చ్ ఫాదర్లు, తాడు బందు ముస్లిం పెద్దలు, బోయిన్ పల్లి మార్కెట్ హమాలీ సంఘం, మార్కెట్ కమీషన్ ఏజెంట్స్ అసోసియేషన్, బొల్లారం సాదన మందిర్ కైలాస్ గూడ వాసులు, వార్డు 5 కాలనీల అసోసియేషన్ సభ్యులు మరియు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల మహిళా సోదరీమణులు, అన్ని బస్తీల ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపి శ్రీగణేష్ చేస్తున్న పోరాటానికి తమ అందండలు పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పారు


