బెట్ ద్వారక: గుజరాత్‌లో ఓఖా నదీతీరాన ఉన్న బెట్ ద్వారక ద్వీపంలో అక్రమ కట్టడాల కూల్చివేతల కారణంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల పరంగా నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ద్వారక అసెంబ్లీ నియోజకవర్గంలో నష్టం కలగవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. సుమారు 15వేల జనాభాలో 10 వేల మందికి పైగా ముస్లింలు బెట్ ద్వారకలో నివసిస్తుండటంతో ఓట్లపై ప్రభావం పడే అవకాశముందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఓఖా పట్టణం నుంచి 3 కి.మీ. దూరంలో నున్న బెట్ ద్వారక దీవికి మర పడవలో ప్రయాణిస్తే అరగంటలో చేరుకోవచ్చు. 13 కిలోమీటర్ల పొడవున్న ఈ దీవి ద్వారక పట్టణం నుంచి 30 కిలోమీటర్లు ఉత్తరంగా ఉంది. 400 కోట్ల రూపాయల ఖర్చుతో 2 కిలోమీటర్ల పొడవైన వంతెనను కట్టాలని కేంద్రం ఇటీవలే ప్రతిపాదించింది.
శ్రీకృష్ణుడి నివాస ప్రాంతమైన బెట్ ద్వారకలో మొదట్లో హిందువులే అధికంగా ఉన్నా ముస్లింల జనాభా పెరిగి హిందువుల వలసలు పెరిగిపోయాయి. విపరీతంగా పెరిగిపోయిన అక్రమ కట్టడాలను గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌తో అక్టోబర్ ఒకటో వారంలో కూల్చివేసింది. దేవ్‌భూమి ద్వారక జిల్లా యంత్రాంగంతో పాటు, ఓఖా మున్సిపాలిటీ అధికారులు ఈ కూల్చివేతల్లో పాల్గొన్నారు. సుమారు 100 వంద అక్రమ కట్టడాలను కూల్చివేశారు. వీటిలో 30 మతపరమైనవి కూడా ఉన్నాయి.
బెట్ ద్వారకలో కూల్చివేతలపై మైనార్టీలు గుర్రుగా ఉన్నారు. అసలే ఈ ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉండటంతో ఓట్లపై ప్రభావం పడే సూచనలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఓట్ల పరంగా నష్టపోతామని తెలిసినా అక్రమ కట్టడాలు కూల్చివేశామని ద్వారక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధిగా మరోసారి బరిలోకి దిగిన ప్రస్తుత ఎమ్మెల్యే పబుబా మానెక్ చెబుతున్నారు. 1990 నుంచి రాజకీయాల్లో ఉన్న మానెక్ తొలుత ఇండిపెండెంట్‌గా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా, ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పటికే 7 సార్లు గెలిచి ఎనిమిదోసారి గెలిచేందుకు మానెక్ ఉవ్విళ్లూరుతున్నారు. 32 ఏళ్లుగా పరాజయమెరుగని ఆయన దేశ భద్రత, అభివృద్ధి అంశాలను రాజకీయ దృష్టితో చూడరాదన్నది తన అభిమతమని చెబుతున్నారు.
ద్వారకా అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 25 వేల ఓట్లు ముస్లింలవే ఉన్నాయి. వీరంతా చాలాకాలంగా మానెక్‌కే ఓటు వేస్తూ గెలిపిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా తన విజయంపై ఆయన ధీమాగా ఉన్నారు. కూల్చివేతలు దేశహితానికే అని ఆయన చెబుతున్నారు. ప్రజలంతా కూల్చివేతల వెనుక అసలు విషయాన్ని అర్థం చేసుకుంటారని మానెక్ చెబుతున్నారు. వాస్తవానికి హిందువుల పవిత్ర స్థలమైన బెట్ ద్వారకలో అక్రమ కట్టడాల కూల్చివేత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా హిందువుల ఓట్లు గంపగుత్తగా పడతాయని బీజేపీ విశ్వసిస్తోంది.
బెట్ ద్వారకలో అక్రమ కట్టడాల కూల్చివేతలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ప్రశంసించారు. శ్రీకృష్ణుడి నివాస స్థలంలో అక్రమ కట్టడాల కూల్చివేతలను స్వాములు కూడా స్వాగతించారు. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. 89 స్థానాలకు డిసెంబర్ 1న ఎన్నికలు జరుగనుండగా, 93 స్థానాల్లో డిసెంబర్ 5న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి.