Sunday, September 8, 2024
spot_img
HomeANDHRA PRADESHప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన ఉద్యోగ సంఘాలు

ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన ఉద్యోగ సంఘాలు

విజయవాడ: ఏపీ జేఏసీ అమరావతికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపిన మినిట్స్‌లో ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఏ విషయాలపైనా స్పష్టత ఇవ్వలేదు. కేవలం ఉద్యోగులు దాచుకున్న డబ్బులకు సంబంధించి రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం హామీ ఇచ్చింది. లోన్లు ఇవ్వటం సాధారణ విధి. ఆర్థిక ప్యాకేజీ ఇస్తున్నట్టుగా ప్రభుత్వం బిల్డప్‌ ఇవ్వటం చూస్తే ఉద్యోగ నేతలకు మతిపోయినంత పనైంది. డీఏ అరియర్స్‌పై ముందుగా ఇస్తామన్న ఆర్థిక ప్యాకేజీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబరు నాటికి ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ రెండు అంశాలకు సంబంధించి రూ.3500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ గురించి తప్ప మిగిలిన అంశాలన్నింటిపైనా స్పష్టత ఇవ్వలేదు. సీఎస్‌ పంపిన లిఖిత పూర్వక మినిట్స్‌పై గురువారం విజయవాడలోని ఏపీ రెవెన్యూభవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి అగ్రనేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, వీవీ మురళీకృష్ణంనాయుడు నిర్వహించిన అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సభ్య సంఘాల సమక్షంలో విస్తృతంగా చర్చ జరిగింది.

రుణాలకు సర్దుబాటుకే ఆర్థిక ప్యాకేజీ పేరు..

ప్రస్తుతం కార్యాచరణకు దిగిన ఏపీ జేఏసీ అమరావతి ఇచ్చిన తాజా డిమాండ్లపై కాకుండా… కార్యాచరణకు పిలుపు ఇవ్వని ఏపీ జేఏసీ, ఏపీజీఈఎఫ్‌ జేఏసీల నేతలు బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి లేవనెత్తిన అంశాలను, గతంలో బొప్పరాజు ఇచ్చిన పాత డిమాండ్లను మినిట్స్‌లో పొందుపరచటంతో అంతా అవాక్కయ్యారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులకు పూర్తిగా లెక్కలు చెప్పలేదు. వారికి రావాల్సిన వాటి లెక్కలూ చెప్పలేదు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలకూ మినిట్స్‌లో స్పష్టత ఇవ్వలేదు. ప్రభుత్వం ఈ నెలాఖరులోపు ఇస్తామన్న వాటిలో ప్రధానంగా జీపీఎఫ్‌, ఏపీ జీఎల్‌ఐ తదితర లోన్లకు సంబంధించి సర్దుబాటు చేసే మొత్తాన్ని తెలివిగా ఆర్థిక ప్యాకేజీగా పేర్కొంది.

ఎంతమందికి? ఎంత? లెక్కలే లేవు..

ఉద్యోగులకు చట్టబద్ధంగా రావాల్సిన వాటికి సంబంధించి ఇస్తామన్న ఆర్థిక ప్యాకేజీలో ఎర్న్‌ లీవులు, డీఏ అరియర్స్‌ రూ.2 వేల కోట్లు సెప్టెంబరు నాటికి చెల్లిస్తామన్నారు. డీఏ అరియర్స్‌ ఎంత ఇవ్వాలో లెక్కలు చెప్పలేదు. జూలై 1, 2018 నాటికి ఎంత ఇవ్వాలి? ఎంత మందికి ఇచ్చారు? ఇంకా ఎంత మందికివ్వాలి? ఈ లెక్కలూ లేవు. జనవరి 1, 2019కి సంబంధించి ఇప్పటి వరకు ఎంత మందికిచ్చారు? ఇంకెంత మందికివ్వాలి? ఎంత ఇచ్చారు? ఈ లెక్కలూ తెలపలేదు.

ఏపీ జేఏసీ అమరావతి మొదటి డిమాండ్‌గా పీఆర్సీ, పేస్కేల్స్‌ గురించి చెప్పమని అడిగితే మినిట్స్‌లో ఆ విషయాలేమీ తెలపలేదు. 11వ పీఆర్సీ స్కేల్స్‌ తెలిస్తే కానీ పీఆర్సీ అరియర్స్‌ లెక్కలు తేలవు. ఉద్యోగులకు వేల కోట్లు రావాల్సింది పీఆర్సీ అరియర్సే. బుధవారం సీఎ్‌సతో చర్చల్లోనూ దీనిపై నేతలు స్పష్టంగా చెప్పారు. అయినా, దీనిపై స్టడీ చేయలేదని మినిట్స్‌లో పేర్కొన్నారు.

1నే జీతాల చెల్లింపుపైనా హామీ లేదు..

జీతభత్యాలను ఒకటో తేదీన చెల్లించాలని ఇచ్చిన అంశంపై కూడా మినిట్స్‌లో హామీ ఇవ ్వలేదు. ‘మాకు మనస్ఫూర్తిగా ఇవ్వాలని ఉంది. కానీ, ఇవ్వలేకపోతున్నాం’ అని పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వం ఇచ్చిన హామీలపైనా మినిట్స్‌లో స్పష్టత ఇవ్వలేదు. ప్రధానంగా సీపీఎస్‌ రద్దుకు సంబంధించి మళ్లీ బెటర్‌ పెన్షన్‌ స్కీమ్‌(బీపీఎ్‌స)ను తీసుకువస్తామని ప్రభుత్వం తెలిపింది. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఇచ్చిన హామీని మినిట్స్‌లో తెలియ చేయలేదు.

జేఏసీ సభ్య సంఘాల మండిపాటు

మినిట్స్‌లోని అంశాలను బొప్పరాజు ఈ సమావేశం దృష్టికి తీసుకురావటంతో.. జేఏసీ సభ్య సంఘాలన్నీ మండిపడ్డాయి. ‘ప్రభుత్వం ఏదో చేస్తుందన్న నమ్మకం మాకైతే లేదు. మీకేమైనా ఉందా?’ అని నేతలు ఆయనను ప్రశ్నించారు. మినిట్స్‌నే నిర్లక్ష్యంగా ఇచ్చారని, ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చులకన భావం తేటతెల్లమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వాన్ని ఎందుకింత నమ్ముతున్నారని నిలదీశారు. ఇప్పటికే నాలుగేళ ్ల సమయం ఇచ్చారని, ఇంకా ఎంత సమయం ఇస్తారని నిగ్గదీశారు. డీ ఏ అరియర్స్‌పై కొంత మేర సెప్టెంబరు నాటికి ఇస్తామని చెప్పటంలోనూ మోసం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు పోయినా.. ఏమీ సాధించుకోలేమని, అప్పటి వరకు ఆగితే.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణను ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. దీంతో ఏపీ జేఏసీ అగ్రనాయకత్వం దిగిరాక తప్పలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments