పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు బండి సంజయ్ గాలి వీస్తోందని బీజేపీ పార్లమెంట్ ఎన్నికల రాష్ట్ర ఇంఛార్జీ అభయ్ పాటిల్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి బండి సంజయ్ గతంలో పోలిస్తే రెట్టింపు మెజారిటీతో గెలవబోతున్నారని రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి 10 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు రాబోతున్నాయని చెప్పారు. ఆదివారం కరీంనగర్ లోని శుభమంగళ కన్వెన్షన్ లో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీతో అంతర్గత సమావేశం నిర్వహించారు. అభయ్ పాటిల్ తోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, ప్రతాప రామక్రిష్ణ, జిల్లా ఇంఛార్జీ మీసాల చంద్రయ్య, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ గెలుపు కోసం నిర్వహించాల్సిన సభలు, సమావేశాలు, కార్యక్రమాలపై అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాను విస్త్రతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. మోదీ ప్రభుత్వం దేశం కోసం చేపట్టిన విప్లవాత్మక చర్యలతోపాటు ప్రజల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మీడియాలో ప్రచారం చేయాలని కోరారు. అందులో భాగంగా సామాజిక వర్గాల వారీగా సమావేశం నిర్వహించాలని సూచించారు. అట్లాగే యువత, మహిళ, కార్మికులుసహా వివిధ వర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహంచాలని కోరారు.
అనంతరం అభయ్ పాటిల్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ, బండి సంజయ్ గాలి వీస్తోందని, వీటిని ఓట్ల రూపంలో రాబట్టాలంటే పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల అధ్యక్షుల పాత్ర కీలకమన్నారు. ఇకపై ప్రతి కార్యకర్త పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఓటర్ ను మూడు సార్లు కలిసి బీజేపీకి ఓట్లు వేసేలా ప్రచారం నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరుగుతున్నామని, అన్ని సర్వేలను పరిశీలిస్తున్నామని ఏ సర్వే చూసినా 8 నుండి 12 సీట్లు రావడం ఖాయమనే చెబుతున్నాయని తెలిపారు. ‘‘40 ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నానని, నాకున్న అనుభవం మేరకు చెబుతున్నా. రాష్ట్రంలో బీజేపీకి 10 కంటే తక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశమే లేదు. తక్కువొస్తే నన్ను అడగండి’’అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలెవరూ బీఆర్ఎస్ కు ఓటేసేందుకు సిద్దంగా లేరని చెప్పిన అభయ్ పాటిల్ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలంతా ప్రత్యామ్నాయ పార్టీలవైపు ద్రుష్టి సారించారని చెప్పారు. రాష్ట్రంలో మోదీ, సంజయ్ గాలి వీస్తున్నందున ఆయా ఓట్లను బీజేపీకి పడే విధంగా చేయడంలో కార్యకర్తల పాత్రే కీలకమని చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల విషయానికొస్తే గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి బండి సంజయ్ రెట్టింపు మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు. ఆర్దిక ప్రగతిలో దేశాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతూ ప్రజలకు అభివ్రుద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న నరేంద్రమోదీ వంటి మహానుభావుడు ఒకవైపు తానే తెలివైన నాయకుడినని భ్రమించే నాయకుడు రాహుల్ గాంధీ ఒకవైపు ఉన్నారని ఎవరెన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మాత్రం మోదీవైపే ఉన్నారని చెప్పారు. పోలింగ్ బూత్ ల వారీగా పనితీరుపై అంచనా వేస్తున్నామని, ఈ విషయంలో కఠినంగా ఉంటామన్నారు. ఎవరేమనుకున్నా తాను పార్టీ కోసం పనిచేస్తానని, వారం రోజుల్లో మళ్లీ కరీంనగర్ కు వస్తానని తెలిపారు.