Tuesday, February 11, 2025
spot_img
HomeNATIONALవక్ఫ్‌బోర్డ్ సంచలన నిర్ణయం!

వక్ఫ్‌బోర్డ్ సంచలన నిర్ణయం!

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మదర్సాలలో సిలబస్, యూనిఫామ్ విషయంలో భారీ మార్పులు తీసుకురానున్నట్టు ప్రకటించింది. మదర్సాలను ఆధునికీకరించడం, బోధనను మరింతగా మెరుగుపరచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) సిలబస్‌ను ప్రవేశపెట్టడంతోపాటు డ్రెస్‌కోడ్‌లోనూ మార్పులు తీసుకొస్తామని వక్ఫ్ బోర్డు చైర్మన్ షాదాబ్ షామ్స్ తెలిపారు. మదర్సాలలో అన్ని మతాల వారికి అడ్మిషన్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఉత్తరాఖండ్‌లో వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో 103 మదర్సాలు ఉన్నాయి.

తాజా నిర్ణయం ప్రకారం వచ్చే ఏడాది నుంచి మదర్సాలలో ఉదయం 6.30 గంటల నుంచి 7.30 వరకు అంటే గంట సమయం మాత్రమే మతపరమైన విద్యా బోధన ఉంటుంది. ఆ తర్వాత 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇతర స్కూళ్ల లానే సాధారణ సబ్జెక్టులను బోధిస్తారు. తాజా నిర్ణయం వల్ల మదర్సా విద్యార్థులు ప్రధాన విద్యా మాధ్యమంలోకి వెళ్లొచ్చని, మరింత మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని షాదాబ్ పేర్కొన్నారు. అలాగే, ఏడు మోడల్ మదర్సా (Model Madarsas)లను తయారు చేయాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. డెహ్రాడూన్, హరిద్వార్, ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాల్లో రెండేసి, నైనిటాల్‌లో ఒకటి ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అక్కడ స్మార్ట్‌క్లాసులు కూడా ఉంటాయన్నారు.

మదర్సాలకు వెళ్లే పిల్లల ఓ చేతిలో ఖురాన్, మరో చేతిలో ల్యాప్‌టాప్ ఉండాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు తెలిపింది. మదర్సాలను ఆధునిక విద్యావిధానానికి కేంద్రంగా మార్చాలనుకుంటున్నట్టు షామ్స్ పేర్కొన్నారు. అలాగే, మదర్సాలలో హఫీజ్-ఇ-ఖురాన్ (Hafiz-e-Quran) బోధనను నాలుగేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలని బోర్డు నిర్ణయించినట్టు ఆయన వివరించారు. అప్పటికి కోర్సు పూర్తయిపోయిందని, విద్యార్థులు 10 లేదంటే 12వ తరగతి పాసవుతారని అన్నారు. అప్పుడు వారికి మరింత పరిపక్వత వస్తుందని, దీంతో వారు మతపరమైన విద్యాను కొనసాగించాలా? లేదంటే డాకర్టు, ఇంజినీర్లు కావాలా? అన్నది నిర్ణయించుకోగలుగుతారని అన్నారు. ఆధునిక మదర్సాల కోసం తమవంతు సాయమందిస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి చందన్ రామ్ దాస్ బోర్డుకు హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments