ఢిల్లీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రస్తుత పార్లమెంట్ ఆవరణలోనే 13 ఎకరాల్లో శోభాయమానంగా నిర్మాణం జరుగుతోంది. ప్రధాని మోదీ కలల సౌధం నూతన పార్లమెంటు భవనం సిద్ధమైంది. జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. 29న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలి ప్రసంగం చేయనున్నారు. తర్వాత పాత పార్లమెంట్‌లోనే బడ్జెజ్ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతానికి లోక్ సభ మాత్రమే సిద్ధం కాగా.. రాజ్యసభతో పాటు పలు విభాగాల్లో పనులు జరుగుతున్నాయి. ఈ కొత్త పార్లమెంట్ విజువల్స్‌ను ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది.
ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిది. కొత్త ఢిల్లీ రూపకర్తలు ఎడ్విన్ లుట్యెన్స్, హెర్బెర్ట్ బేకర్‌లు ఈ పార్లమెంటును డిజైన్ చేశారు. 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి సుమారు ఆరేళ్లు పట్టింది. రూ. 83 లక్షల వ్యయంతో తయారైన ఈ భవనాన్ని 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్ట్ ఇర్విన్ ప్రారంభించారు. ప్రస్తుతం పెరిగిన అవసరాల నేపథ్యంలో ఇప్పుడున్న పార్లమెంటు భవనంలో వసతులు, సౌకర్యాలు సభ్యులకు సరిపోవడం లేదు. అందుకే ప్రస్తుత పార్లమెంటు భవనం కన్నా నాలుగు రెట్లు పెద్దదైన భవనానికి మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
కొత్త పార్లమెంటు భవనానికి 2020 డిసెంబర్ 10వ తేదీన ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 971 కోట్ల రూపాయలు కాగా, నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. కొత్త భవనం ప్రస్తుత పార్లమెంటు భవనం కన్నా 17వేల చదరపు మీటర్ల మేర పెద్దదిగా ఉంది. ఇందులో లోక్‌సభ సభ్యుల కోసం సుమారు 888 సీట్లు, రాజ్యసభ సభ్యుల కోసం 326 కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. లోక్‌సభలో ఏక కాలంలో 1,224 మంది సభ్యులు కూర్చునేందుకు వీలు ఉంటుందని అధికారులు తెలిపారు.
హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ భవనం డిజైన్‌ను రూపొందించింది. మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే కొత్త పార్లమెంటు భవనం భారతదేశపు భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా ఆత్మనిర్భర్ భారత్‌కు దేవాలయంలా ఉంటుందని మోదీ పదే పదే చెబుతున్నారు.
ఈ కొత్త పార్లమెంటు భవనం నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్ నాటికే పూర్తి అవుతుందని భావించారు. కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతానికి లోక్ సభ ప్రాంగణం మాత్రమే సర్వాంగ సుందరంగా తయారైంది. ఈ నెల చివర్లో లోక్ సభ సెక్రటరియేట్‌కు ఈ సభను అప్పగించనున్నారు. రాజ్యసభతో పాటు మిగతా ఇంటీరియర్ పనులన్నీ పూర్తి స్థాయిలో పూర్తి కావడానికి సుమారు ఆరేడు నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త పార్లమెంట్ చుట్టూ రోడ్ల నిర్మాణం కూడా ప్రారంభమైంది.
భారత స్వాతంత్ర్యానికి 75వ వార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా కొత్త పార్లమెంటు భవనంలో ఉభయసభల సమావేశాలను ప్రారంభించాలని భావించారు. అందుకే వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం రోజున ప్రధాని మోదీ చేతుల మీదుగా లోక్ సభను ప్రారంభించడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఆ తరువాత జనవరి 29వ తేదీ నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల ప్రారంభం అవుతున్నాయి. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి బడ్జెట్ ప్రసంగానికి కొత్త పార్లమెంటులోని లోక్ సభ ను వేదికగా చేయాలని మోదీ భావిస్తున్నట్లు తెలిసింది. మిగతా బడ్జెట్ సమావేశాలను మాత్రం ప్రస్తుతం ఉన్న పార్లమెంటులోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. గణతంత్ర దినోత్సవం నాటికి వీలైనంత వరకూ పనులను పూర్తి చేయాలని టాటా కంపెనీ భావిస్తోంది.