Friday, July 12, 2024
spot_img
HomeCINEMAవన్స్‌ మోరు... చూపించాలి జోరూ..

వన్స్‌ మోరు… చూపించాలి జోరూ..

తెరపై హిట్‌ కాంబినేషన్లు

ఎండాకాలంలో… పుచ్చకాయ్‌ పిచ్చెక్కే కాంబో. వానొచ్చినప్పుడు.. మిరపకాయ్‌ బజ్జీ.. తిరుగులేని జోడీ! శీతాకాలం… చలిమంట.. వెచ్చనైన జంట. ఇలా… సీజన్‌ని బట్టి కాంబినేషన్లు క్రేజీగా కనిపిస్తుంటాయి. ఒకటి గుర్తొస్తే.. మరోటి ఆటోమెటిక్‌గా కళ్ల ముందు మెదులుతుంది. సినిమాల్లోనూ ఈ రకమైన కాంబినేషన్లు కనువిందు చేస్తుంటాయి. దాన్ని సినిమా భాషలో ‘హిట్‌ కాంబో’ అంటుంటారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అని.. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా.. ఈ హిట్‌ కాంబినేషన్‌కి మంచి గిరాకీ ఉంది. ఫలానా దర్శకుడు.. ఫలానా హీరో కలిసి పని చేస్తున్నారు అనగానే అంచనాలు మొదలైపోతాయి. ఆల్రెడీ హిట్టు కొట్టిన జోడీ కాబట్టి… ఆ చరిత్ర పునరావృతం అవ్వడం ఖాయమని సినీ వర్గాలు నమ్ముతుంటాయి. ప్రేక్షకులూ అలానే భరోసా పెంచుకొంటుంటారు. అందుకే హిట్‌ కాంబినేషన్లు వరుస కడుతుంటాయి. ఈ సీజన్‌లోనూ అదే జరుగుతోంది. హిట్టు కొట్టిన హీరోలూ, దర్శకులు ‘వన్స్‌ మోర్‌’ అనేస్తున్నారు. మళ్లీ కలసి పనిచేయడానికి చేయీ చేయీ కలుపుతున్నారు. ఆ కాంబోలపై ఓ లుక్కేస్తే…

సినిమా వ్యాపారంలో కీలకమైన పాత్ర పోషించేది కథానాయకుడు, దర్శకుడే. వాళ్ల ఇమేజ్‌ని బట్టి, హిట్‌ ట్రాక్‌ని బట్టే ఆయా చిత్రాల మార్కెట్‌ ఉంటుంది. టాప్‌ హీరో, అగ్ర శ్రేణి దర్శకుడు కలసి పనిచేయడానికి ముందుకొచ్చారంటే ఆ సినిమాకొచ్చే క్రేజ్‌ మామూలుగా ఉండదు. ఇది వరకే వాళ్లు హిట్‌ కొడితే… ఆ కాంబోపై మరింత ఫోకస్‌ పెరుగుతుంది. అలా కొన్ని కాంబోలు అందరి చూపూ తమ వైపుకు తిప్పుకొనేలా చేశాయి. అలాంటి జోడీలలో మహేశ్‌ బాబు – త్రివిక్రమ్‌ ఒకటి. ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలతో ఆకట్టుకొన్న జోడీ ఇది. ‘అతడు’ ఓ క్లాసిక్‌. ఈ సినిమాకి విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. మహేశ్‌ని చూపించిన విధానానికీ, యాక్షన్‌ సన్నివేశాల్ని స్టైలీష్‌ గా డిజైన్‌ చేసిన పద్ధతికి మహేశ్‌ ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. ‘ఖలేజా’ బాక్సాఫీసు దగ్గర పెద్దగా ఆడలేదు. కాకపోతే.. బుల్లి తెరపై ‘ఖలేజా’ సూపర్‌ హిట్‌. మహేశ్‌ బాడీ లాంగ్వేజ్‌ ఈ చిత్రంలో మరింత విభిన్నంగా ఉంటుంది. అప్పటి నుంచీ.. మహేశ్‌ – త్రివిక్రమ్‌ మళ్లీ ఎప్పుడు పనిచేస్తారా? అంటూ అభిమానులంతా ఆశగా ఎదురు చూడడం మొదలెట్టారు. వాళ్ల నిరీక్షణ ఫలించింది. మహేశ్‌ – త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ కాంబో పట్టాలెక్కింది. ఈ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలున్నాయి. ఇలానే… సినిమా ‘క్లాప్‌’ కొట్టకుండానే అందరి దృష్టినీ తమ వైపుకు తిప్పుకొన్న కాంబో..పవన్‌ కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌. ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ అంటూ పవన్‌ని మాస్‌కి మరింత నచ్చేలా, అభిమానులు మెచ్చేలా.. పవన్‌ పాత్రని తీర్చిదిద్దాడు హరీశ్‌. అందుకే ‘గబ్బర్‌ సింగ్‌’ పవర్‌ స్టార్‌ అభిమానుల గుండెల్లో అంతలా గూడు కట్టుకుపోయింది. అప్పటి నుంచీ.. వీరిద్దరూ కలిసి మరో సినిమా ఎప్పుడు చేస్తారా? అంటూ ఊహల్లోకి వెళ్లిపోయారు. ఈమధ్య ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’తో ఆ నిరీక్షణ ఫలించింది. ఇటీవలే ఈ చిత్రానికి క్లాప్‌ కొట్టారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది.

‘జనతా గ్యారేజ్‌’తో అలరించారు ఎన్టీఆర్‌ – కొరటాల శివ. మాస్‌ ఇమేజ్‌ ఉన్న ఎన్టీఆర్‌తో.. ఓ మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమా చేయడం కొరటాలకే చెల్లింది. అయితే.. ఎన్టీఆర్‌ స్టైల్‌ని ఎక్కడా వదల్లేదు. అందుకే ఈ కాంబో పర్‌ఫెక్ట్‌గా కుదిరిపోయింది. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ – కొరటాల జట్టు కట్టారు. ఫిబ్రవరిలో ఈ సినిమా మొదలు కానుంది. జాన్వీ కపూర్‌ కథానాయికగా నటించబోతోందని సమాచారం. రామ్‌ చరణ్‌ కెరీర్‌లో ‘రంగస్థలం’ ఓ మైలు రాయి. చరణ్‌ని సుకుమార్‌ చూపించిన విధానం, ఆ పాత్రని తీర్చిదిద్దిన పద్ధతీ… ఎంత చెప్పినా తక్కువే. ‘రంగస్థలం’ పూర్తయిన వెంటనే ఇదే కాంబోలో మరో సినిమా మొదలవుతుందని ప్రచారం జరిగింది. అయితే సుకుమార్‌ ‘పుష్ప’తో బిజీ అయిపోయారు. ‘పుష్ప 2’ అవ్వగానే చరణ్‌ – సుకుమార్‌ల రెండో సినిమా మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. ‘గీతా గోవిందం’తో మెప్పించిన విజయ్‌ దేవరకొండ – పరశురామ్‌ మళ్లీ కలిపి పనిచేయబోతున్నారని టాలీవుడ్‌ సమాచారం. విజయ్‌ కోసం ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ని పరశురామ్‌ సిద్ధం చేశాడని, ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. రౌడీ రెరీర్‌లో తొలి వంద కోట్ల సినిమా ‘గీత గోవిందం’. ఈ సినిమాతోనే దర్శకుడిగా తన రేంజ్‌ పెంచుకొన్నాడు పరశురామ్‌. ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే.. మరో వంద కోట్ల సినిమా రావడం ఖాయమనే టాక్‌ వినిపిస్తోంది.

హిట్‌ కాంబోలో సినిమా పట్టాలెక్కించడం వెనుక మార్కెట్‌ పరంగా చాలా వెసులుబాట్లు ఉంటాయి. దర్శకుడికీ, హీరోకీ ట్యూనింగ్‌ కుదిరే ఉంటుంది కాబట్టి.. వారిద్దరూ సమన్వయంతో పనిచేసుకోగలరు. పైగా ఒకరి బలాలు, బలహీనతలు మరొకరికి తెలిసే ఉంటాయి. కాబట్టి… ప్రయాణం నల్లేరుపై నడకలా సాగిపోతుంటుంది. అయితే… ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ పెంచుకొన్న అంచనాల్ని అందుకోవడం అంత సులభం కాదు. ప్రేక్షకుల్ని అంచనాల్ని అందుకొనే స్థాయిలో స్ర్కిప్టు ఉండాలి. కేవలం కాంబోల్ని నమ్ముకొని సినిమాలు తీస్తే మాత్రం ఎదురు దెబ్బ తినడం ఖాయం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments