దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఎక్స్ వేదికగా ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, ఆరోగ్యం చేకూరాలని ఆకాంక్షించారు. “అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఈ సంవత్సరం అందరికీ శ్రేయస్సు, శాంతి, అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించాలి” అని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆదివారం మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడారు. ప్రస్తుతం మన దేశం సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉందని అన్నారు. ఆత్మనిర్భరత సాధించడంతోపాటు అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్న స్ఫూర్తి అంతటా విరజిల్లుతోందని చెప్పారు. ఇది 2024లోనూ కొనసాగాలని పిలుపునిచ్చారు. అలాగే గతేడాది అనేక రంగాల్లో మనదేశం సాధించిన విజయాలను ప్రధాని ప్రస్తావించారు.
కాగా కొత్త సంవత్సరం 2024కు ప్రపంచం మొత్తం ఘనస్వాగతం పలికింది. ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాణాసంచా పేల్చి, కేక్‌లు కట్ చేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. మనదేశంలోనూ నూతన సంవత్సర వేడుకలు అంబారాన్నంటాయి. అర్ధరాత్రి దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సరం సందర్భంగా నేడు తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.