హైదరాబాద్: హైదరాబాద్ ఫార్మాసిటీని గానీ, శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైల్‌ను గానీ రద్దు చేయడంలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వీటిని స్ర్టీమ్‌లైన్ చేస్తున్నామన్నారు. ఫార్మాసిటీని, విమానాశ్రయానికి మెట్రోను హోల్డ్‌లో పెడుతున్నామంటూ గత డిసెంబరు 16న సీఎం చేసిన ప్రకటనతో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో వాటిపై తాజాగా స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సోమవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఫార్మాసిటీని అంచెలంచెలుగా ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్‌ల మధ్య కాలుష్య రహిత క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామన్నారు. ఆ క్లస్టర్లలో పనిచేసే కార్మికులు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా వారికోసం ఎక్కడికక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఇళ్ల నిర్మాణాలు కూడా చేపడతామని వివరించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరాన్ని కూడా గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికన్నాతగ్గిస్తామని చెప్పారు. బీహెచ్‌ఈఎల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేస్తున్నట్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఒవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్‌కు లింక్ చేయనున్నట్లు చెప్పారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రాపురం వరకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ట్ వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు. గచ్చిబౌలి నుంచి విమానాశ్రయానికి మెట్రోలో వెళ్లేవారు దాదాపు ఉండరని సీఎం అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం ప్రతిపాదించనున్న మెట్రో కారిడార్లు.. గత ప్రభుత్వం ప్రతిపాదించిన కారిడార్లతో పోలిస్తే.. తక్కువ ఖర్చుతో పూర్తవుతాయని, దూరం కూడా తగ్గుతుందని అన్నారు.
యువతకు నైపుణ్యాల కోసం 10 వర్సిటీలు..
యువతకు అవసరమైన నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేకంగా 10 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన టాటా, మహేంద్ర వంటి సంస్థలు, ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా వారికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఈ డిగ్రీలకు ఉంటాయని, నైపుణ్యాలు అదనంగా ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో యువత ఉందని, వారికి ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పించనున్నట్లు, ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్‌ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని పేర్కొన్నారు.
అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం..
అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. మధ్యలో తాము జోక్యం చేసుకోబోమని, చెప్పేదొకటి.. చేసేది మరొకటి తన వద్ద ఉండవని స్పష్టం చేశారు. మూడు పోలీసు కమిషనరేట్లకు కమిషనర్లను నియమించామని, వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారని అన్నారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకే తాను చూస్తానని, వారి పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలని చెప్పారు. అధికారుల నియామకాల్లో న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సంస్కరణలు తీసుకువచ్చి స్ర్టీమ్ లైన్ చేసే పనిలో ఉన్నట్టు పేర్కొన్నారు.
స్టేట్ గెస్ట్‌హౌ్‌సగా గత సీఎం క్యాంపు ఆఫీస్..
గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ేస్టట్ గెస్ట్‌హౌ్‌సగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రెస్ అకాడమీకి కొత్త చైర్మన్‌ను నియమించిన తరువాత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇప్పటినుంచి వంద రోజుల్లో జర్నలిస్టుల సమస్యల్ని పూర్తి స్తాయిలో పరిష్కరిస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో వంద పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజీ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
రేపు పీసీసీ విస్తృత స్థాయి సమావేశం..
ఈ నెల 3న (బుధవారం) పీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తనకు దగ్గరగా ఉండేవారనో, బంధువనో పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, ఏది చేసినా పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేస్తామని స్పష్టం చేశారు.