రాజన్న సిరిసిల్ల జిల్లా: ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్ష్యుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబ పాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. తప్పు చేయకపోతే.. విచారణ అధికారులకు పూర్తిగా సహకరించాలని డిమాండ్ చేశారు.
ఫారెస్ట్ అధికారి హత్య ఎలా జరిగింది.?
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి కొంత మంది గుత్తికోయలు వలస వచ్చారు. వీరు కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఎర్రబోడులో అవాసం ఏర్పాటు చేసుకున్నారు. పోడు వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. పోడు భూముల సర్వే కోసం బెండాలపాడు పంచాయతీ కొన్ని రోజుల కిందట తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఎర్రబోడులో కొంత మంది గిరిజనులు ప్లాంటేషన్ మొక్కలను ధ్వంసం చేసి పోడుకు సిద్ధమైనట్లు నవంబర్ 22వ తేదీ ఉదయం అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు, ఇద్దరు సిబ్బందిని వెంటబెట్టుకొని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్లాంటేషన్ మొక్కలను నరికేస్తున్న వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో గుత్తికోయలకు, ఫారెస్ట్ సిబ్బందికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆఫీసర్ శ్రీనివాసరావుపై కొంత మంది గిరిజనులు వేటకొడవళ్లు, గొడ్డళ్లతో ఒక్కసారిగా దాడి చేశారు. వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరకడంతో శ్రీనివాసరావు రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయణ్ని సహచర సిబ్బంది వెంటనే ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ముందస్తు ప్రణాళికతోనే శ్రీనివాసరావుపై దాడి చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ దాడి ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులు అరా తీశారు. పోలీసులు విచారణ చేపట్టారు.