హైదరాబాద్ మహానగరంలో మూసీనది ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చివరి వరకు మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మొత్తం ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ బ్రిడ్జిలు, కమర్షియల్, షాపింగ్ కాంప్లెక్సులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, హాకర్ జోన్లు, పాత్వేలను ప్రభుత్వ, ప్రైవేటు పార్ట్నర్ షిప్ విధానంలో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసీనదిలో కాలుష్యాన్ని తగ్గించి, మురుగు నీరు ప్రవహించకుండా అవసరమైన ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మూసీలో శుద్ధి చేసిన నీరు ప్రవహించేందుకు చర్యలు చేపట్టడంతోపాటు తగు నీటి మట్టం ఉండేలా చెక్ డ్యాంలు నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.