విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి ఇష్టపడి చదవాలనీ ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించడానికి కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ అన్నారు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు వేడుక నిర్వహించిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు. ఈ వీడ్కోలు వేడుకలో ఇంచార్జి ప్రిన్సిపాల్ క్యాతం సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, సేవాభావం, మానవతాభావాలు అలవర్చుకోవాలన్నారు. ఉత్తీర్ణత శాతం పెంచాలని కళాశాలకు పేరు తేవాలని అన్నారు. జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ తల్లిదండ్రులు, గురువులను గౌరవించాలనీ, విద్యార్థి దశ నుండే శ్రమజీవనం అలవర్చుకోవాలనీ, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలనీ, చక్కగా చదువుకుని ఉన్నత రంగాల్లో స్థిరపడాలని అన్నారు. కార్యక్రమంలో చంద్రమౌళి, భూమక్క, విష్ణు ప్రసాద్, విమల్ కుమార్ తదితరులు ప్రసంగించారు.
