రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో పశువుల నీటి తొట్టి పునర్నిర్మాణం అంశంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సర్పంచ్ ఇచ్చిన వివరణ మేరకు గ్రామంలో గతంలో ఒక ప్రాంతంలో ఉన్న పశువుల నీటి తొట్టిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి ధ్వంసం చేసి తమ సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు ఆరోపించారు. ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్, పాలకవర్గం ఆధ్వర్యంలో ప్రజల మధ్య చర్చ జరిగింది. గ్రామసభ తీర్మానం మేరకు పాత స్థలంలోనే పశువుల నీటి తొట్టిని తిరిగి నిర్మించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. తీర్మానం ప్రకారం పునర్నిర్మాణ పనులను శుక్రవారం రోజున ప్రారంభించగా, ఆక్రమణదారుడు అక్కడికి చేరుకోగా వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సమస్య గురించి చర్చించి గోడవను సద్దుమణిగించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామసభ తీర్మానాన్ని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యతని, అభివృద్ధి పనులకు ఎవరైనా ఆటంకం కలిగించవద్దని గ్రామాభివృద్ధి కోసం అందరూ సహకరించాలని కోరారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు అడ్డుకున్నా, గొడవలకు దిగినా వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలని పోలీసులు సూచించగా, పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉన్నట్లు సమాచారం.అభివృద్ధి పనులు ప్రజల ప్రయోజనార్థమే జరుగుతున్నాయని, అందరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ మాశెట్టి లక్ష్మణ్ కోరారు.


