మార్పు అనే నినాదంతో 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక ఉద్యోగ నియామకాలు, ఇతరత్రా సంక్షేమ పధకాల ప్రకటనలు వాటి అమలు వంటి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు మంచి చేస్తున్నట్లు అనిపించింది. కానీ గత 6 నెలలుగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ప్రభుత్వం నడుస్తున్న తీరుపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఏంతో మంది పాలకులు కొంతమంది అధికారుల తెలివితక్కువ నిర్ణయాలకు బలై తమ రాజకీయ జీవితాలను అంతం చేసుకున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారనడానికి మరో ఉదాహరణ తాజాగా తీసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలల తనిఖీ కమిటీల నిర్ణయం. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తనిఖీలకై దాదాపు 1473మంది ఉపాధ్యాయులతో తనిఖీ కమిటీలు వేసి, ఆ ఉపాధ్యాయులను కేవలం తనిఖీల కోసమే డ్యూటీలు అప్పగిస్తూ, ఇక వారు పాఠశాలలోచదువులు చెప్పాల్సిన అవసరం లేదంటూ “విద్యార్థులను బోధనకు దూరం చేసి, కేవలం పాఠశాలల తనిఖీల బాధ్యతలు అప్పగించడం” అంటే, ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో అరకొర చదువులు చదువుతున్న పేద విద్యార్థులకు ఆ చదువులకు కూడా దూరం చేయడమే అవుతుంది.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చదువుసామర్థ్యం పెరగడానికి ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండడం, విద్యార్థులకు తగ్గట్టు ఉపాధ్యాయుల నియామకం లేకపోవడం పెద్ద సమస్య” అయితే, ఆ సమస్యను పట్టించుకోకుండా పాఠశాలల తనిఖీల పేరుతో దాదాపు 10 ఏళ్ల అనుభవం ఉన్న ఉపాధ్యాయులను ఈ తనిఖీ కమిటీలో నియమించడం వల్ల ప్రభుత్వానికి ఏం లాభం? విద్యార్థులకు ఏం లాభం? ఉపాధ్యాయులకు ఏం లాభం?
తనిఖీలు చేసి వాళ్ళు ఇచ్చే నివేదికల వల్ల, పేద విద్యార్థుల చదువుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఏం చేస్తుంది?” ఈ తనిఖీ కమిటీలు నిజంగా వేయాలనుకుంటే, ఆ పాఠశాలలో చదివే పిల్లల తల్లిదండ్రులచే కమిటీలు వేసి, వారి ద్వారానే నివేదికలు తెప్పించుకొని వాటిపై తగు చర్యలు తీసుకోవడం ఉత్తమం. అంతేగాని, ఉపాధ్యాయులతో “తనిఖీ కమిటీలు” వేసి,ఆ “ఉపాధ్యాయుల తోనే ఇతర ఉపాధ్యాయులపై ఫిర్యాదులు చేయించడం అంటే ఉపాధ్యాయుల, ఉపాధ్యాయ సంఘాల మధ్య చిచ్చు పెట్టడమే” అవుతుంది. ప్రభుత్వానికి ఇది తగదు.
ఈ తనిఖీ కమిటీలకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే జీవో జారీ చేసింది. ఈ తనిఖీ కమిటీల వల్ల పేద విద్యార్థులు, ముఖ్యంగా అతి పేదలుగా ఉన్న ముస్లిం విద్యార్థులు చదువుతున్న ఉర్దూ మీడియం స్కూల్లో కూడా వారి చదువులపై ప్రభావం పడి, ముస్లిం విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ జీవో ను వెనక్కి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖకు తెలంగాణ ముస్లిం జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు తెలంగాణ ముస్లిం సంఘాల జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ.అహ్మద్ ఖాన్.


