ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నందకుమార్ అలియాస్ నందును రెండు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి న్యాయస్థానం అనుమతించింది. చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న నందుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో నందును విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీ్‌సలు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా.. రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. సోమ, మంగళవారాల్లో పోలీ్‌సలు నందును కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి సిట్ నోటీ్‌సలు అందుకున్న న్యాయవాది ప్రతాప్ రెండో రోజు (శనివారం) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల్లో సుమారు 16 గంటలు ప్రతా్‌పను సిట్ ప్రత్యేక బృందం విచారించింది. ప్రతాప్ నుంచి నందుకు కొంత నగదు బదిలీ అయినట్లు ఆధారాలు సేకరించిన సిట్ బృందం ఆ డబ్బులు ఎందుకివ్వాల్సి వచ్చిందనే వివరాలపై ఆరాతీసినట్టు తెలిసింది. శుక్రవారం సిట్ విచారణకు హాజరైన నందు భార్య చిత్రలేఖ.. సోమవారం మరోసారి సిట్ ఎదుట హాజరుకానున్నారు. ఈ కేసులో సిట్ నిందితులుగా చేర్చిన తుషార్, జగ్గు స్వామి అజ్ఞాతంలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు సిట్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.