కేజీన్నర పసిడి రేకుల్ని చేతులకు చుట్టుకుని స్మగ్లింగ్
కోచి, మార్చి 9: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ ఉద్యోగి ఒకరు కేజిన్నర బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. కేరళలోని వయనాడ్‌కు చెందిన షఫీ అనే ఉద్యోగి కరిగించి రేకులుగా చేసిన బంగారాన్ని ప్లాస్టిక్ కవర్లలో పెట్టి రెండు చేతులకు చుట్టుకున్నాడు. అవి బయటకు కనిపించకుండా పొడుగు చేతుల యూనిఫాం చొక్కా ధరించాడు. అయితే దీనిపై రహస్య సమాచారం అందడంతో కస్టమ్స్ అధికారులు అతడిపై నిఘా పెట్టారు. బహ్రెయిన్ నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాక గ్రీన్ చానల్ నుంచి హడావుడిగా వెళ్తున్న షఫీని అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద పట్టుబడిన బంగారం విలువ రూ.75 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. షఫీని వెంటనే సస్పెండ్ చేసినట్టు ఎయిరిండియా తెలిపింది.