Thursday, May 23, 2024
spot_img
HomeTELANGANAనోరు మెదపరేం?

నోరు మెదపరేం?

హైదరాబాద్‌: ‘‘అదానీ వ్యవహారంతో రూ.10 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరైతే ప్రధాని మోదీ నోరు మెదపలేదేం?ఆయన మాటలు కోటలు దాటుతాయి. చేతలే ఏమీ ఉండవు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం అన్ని రంగాల్లో వెనకబడింది. మేకిన్‌ ఇండియా పెద్ద జోక్‌గా మారింది. మోస్ట్‌ డిస్గస్టింగ్‌ ప్రధాని మోదీయే’’ అని సీఎం కేసీఆర్‌ ప్రధానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక బహిర్గతమవడంతో మోదీలో ఆక్రోశం బయటపడిందన్నారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ బాగా పనిచేసినా.. ప్రచారం తక్కువ చేసుకున్నారని, మోదీ మాత్రం పని తక్కువ, ప్రచారం ఎక్కువ చేసుకుంటున్నారని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. దేశంలో విచిత్ర పరిస్థితులు, వింత పోకడలు నెలకొన్నాయని, ఇలా ఎందుకు జరుగుతోందో పార్టీలతో పాటు ప్రజలంతా ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.

మోదీ ప్రధాని అయ్యాక 20 లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని, ఉన్న ఊరిని వద్దునుకోవడం కంటే దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఎన్నికలు జరిగితే పార్టీలు గెలుస్తున్నాయని, జనం మాత్రం ఓడిపోతున్నారని.. 2014లో అదే జరిగిందని చెప్పారు. పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం చాలా చండాలంగా ఉందన్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ ఉపద్రవం బయటపడితే దేశం ఏంచేయబోతుందన్న ప్రశ్నలు వినిపించినా.. మోదీ మాత్రం ఒక్క మాట మాట్లడలేదని విమర్శించారు. మోదీ తీరు చూస్తే దేశానికిపెట్టుబడులు ఎలా వస్తాయని కేసీఆర్‌ ప్రశ్నించారు. అదానీ మనదగ్గర కూడా కంపెనీలు పెడతానన్నారని, ఒకవేళ పెడితే మనం కూడా మునిగిపోయేవాళ్లమని చెప్పారు. నెహ్రూ, ఇందిర మరణించి దశాబ్దాలు అవుతున్నా.. మోదీ ఇంకా వాళ్ల గురించే మాట్లాడుతున్నారని విమర్శించారు.

లైసెన్స్‌రాజ్‌.. సైలెన్స్‌రాజ్‌..

పూజా మెహ్రా అనే ఆర్థికవేత్త రాసిన ‘ది లాస్ట్‌ డికేడ్‌’ పుస్తకంలో మన్మోహన్‌, మోదీ ప్రభుత్వాల మధ్య వ్యత్యాసాన్ని చక్కగా వివరించారని, శాసనసభ్యులంతా ఆ పుస్తకాన్ని చదవాలని సీఎం కోరారు. ఆ పుస్తకంలోని పలు అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. మన్మోహన్‌ పాలనలో వార్షికవృద్ధి రేటు 6.80 శాతం ఉంటే మోదీ వచ్చాక అది 5.5కు తగ్గిందన్నారు. కాంగ్రె్‌సకు ఉన్న భావదారిద్య్రం వల్ల వారు ఈ విషయాన్ని మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. యూపీఏ హయంలో తలసరి వృద్ధిరేటు 12.37 శాతముంటే మోదీ హయంలో 7.0 శాతంగా నమోదైందన్నారు. జీడీపీలో అప్పుల శాతం 2014కు ముందు 52 శాతం ఉంటే నేడు 56 శాతానికి చేరి అప్పులు పెరిగాయన్నారు. కేపిటల్‌ వ్యయం మన్మోహన్‌ హయంలో 37.3 శాతం ఉంటే ప్రస్తుతం అది 31 శాతానికి తగ్గిందన్నారు. ఎన్నికలొస్తే బియ్యం ఫ్రీగా ఇవ్వాలి, తెల్లారి ప్రజల నెత్తిన గుద్దాలనే ఽధోరణిలో పీఎం ఉన్నారని అన్నారు. ద్రవ్యలోటు నాడు 4.77 ఉంటే నేడు 5.10 శాతానికి పెరిగిందన్నారు. ఇక ఎగుమతుల వృద్ధిరేటు నాడు 19.5 శాతం ఉంటే నేడు 4.9 శాతానికి పడిపోయిందన్నారు. మేకిన్‌ ఇండియా అనేది జోక్‌గా మారిందన్నారు. తాను చెబుతున్నవి అవాస్తవాలైతే రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. పారిశ్రామిక వృద్ధిరేటు నాడు 5.87 ఉంటే నేడు 3.20కు చేరిందన్నారు. మోదీ ఉపాన్యాసాలు, అదానీ ఆస్తులు మాత్రమే పెరిగాయని చురకలంటించారు.

రూపాయి విలువ నాడు రూ.58.6 ఉంటే నేడు రూ.82కు చేరిందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ దొందూ దొందేనన్నారు. నాడు కాంగ్రెస్‌ లైసెన్స్‌రాజ్‌ అయితే నేడు బీజేపీ సైలెన్స్‌రాజ్‌ అయిందన్నారు. ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్‌ అని ఎద్దేవా చేశారు. ఏ సమాచారం అడిగినా ఇవ్వడం లేదన్నారు. నోట్ల రద్దు విషయంలో ప్రధాని చెప్పింది ఒకటి, చేసింది మరొకటి అని ఆరోపించారు. ఒక్క వందేభారత్‌ రైలును తీసుకొచ్చి ప్రధాని స్థాయి నేతలు 14 చోట్ల వాటిని ప్రారంభిస్తారా? అని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం జనగణన ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. జనాభా లెక్కలు లేకుండా పాలన ఎలా సాధ్యం అవుతుందో చెప్పాలని కేసీఆర్‌ నిలదీశారు. నెహ్రూ హయాం తర్వాత ఇండియా ఆగమైందన్నారు. ఏమైనా చేసి, ఎన్నికల్లో గెలవాలనే ధోరణితో మోదీ ఉన్నారని ఆరోపించారు.

బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..

2023-24 నాటికి మన ఎకనామీ 5 ట్రిలియన్స్‌కు చేరుతుందనడం పెద్దజోక్‌గా సీఎం అభివర్ణించారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్‌ అని పేర్కొన్నారు. మోదీ బడాయిలు పోతున్నారని, వైఫల్యాలను హుందాగా ఒప్పుకోవాలని సీఎం సూచించారు. ఎకనామీగా ఉండటం వేరని, అసలు సంగతి తలసరి ఆదాయం దగ్గర దొరుకుతుందని చెప్పారు. ప్రపంచంలో 192 దేశాలుంటే అందులో తలసరి ఆదాయ ర్యాంకింగ్‌లో ఇండియాది 139వ స్థానమని, మనకంటే పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌, భూటాన్‌ ముందున్నాయని తెలిపారు. దీనిపై చర్చ జరగాలన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా బీబీసీ ఒక కథనాన్ని ప్రసారం చేస్తే దాన్ని ఇండియాలో బ్యాన్‌ చేయాలనడం, సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా ప్రపంచమంతా మనగురించి ఏమనుకుంటుందో కొంచెం ఆలోచించాలన్నారు. వ్యతిరేకిస్తే జైలులో పెడతాం, బ్యాన్‌ చేస్తామంటారా? ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. 2024లో బీజేపీ కుప్పకూలడం ఖాయమని సీఎం జోస్యం చెప్పారు. దేశంలో అంతులేని ప్రైవేటీకరణ జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వేలు, ఎయిర్‌పోర్టులతో పాటు చివరికి భారతదేశ ఆత్మలాంటి ఎల్‌ఐసీని ప్రైవేటుకు అప్పగిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయవని మోదీ అన్నారని, కానీ అవసరమైతే చేయాల్సిన పరిస్థితులుంటాయని అన్నారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా 157 మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలను కేంద్రం మంజూరు చేస్తే వాటిలో ఒక్కటీ రాష్ట్రానికి రాకపోవడం అన్యాయం కాదా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలని ప్రజలూ అడుగుతారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.495 కోట్లు పొరపాటున ఏపీ ఖాతాలో వేశారని, వాటిని తిరిగి ఇప్పించాలని ఏడేళ్లుగా కేంద్రాన్ని అడుగుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటిని అడిగినా.. కేంద్రం ‘మేం ఇయ్యం గాక ఇయ్యం’ అన్న ధోరణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఏది అడిగినా ఇవ్వబోమన్నాడు.. ఇప్పుడాయన ఎక్కడికి పోయాడు? అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. మోదీ కూడా అహంకారంతో వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. కేంద్రం పనితీరు సరిగా లేకపోవడం వల్లనే తెలంగాణ రూ.3 లక్షల కోట్లు నష్టపోయిందన్నారు.

బీఆర్‌ఎస్‌ సర్కారుతోనే పరిష్కారం..

నదీ జలాల పంపకాలు, వాటాలు తేల్చడంలో కూడా తీవ్రమైన జాప్యం జరుగుతుందని.. ఫలితంగా రాష్ట్రాల మధ్య జలయుద్ధాలు జరుగుతున్నాయని కేసీఆర్‌ విమర్శించారు. ఇప్పుడున్న దేశ ఇరిగేషన్‌ పాలసీని బంగాళాఖాతంలో పడేస్తామన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు కొత్త ఇరిగేషన్‌ పాలసీని తెస్తామని చెప్పారు. దేశం ఇలా ఉంటే చూడలేకపోతున్నానని.. అందుకే రిటైరయ్యే వయసులోనూ బీఆర్‌ఎ్‌సను ఎత్తుకున్నామని తెలిపారు. విశ్వగురువులు కాదని, దేశగురువులు కావాలని అన్నారు. దుమ్మున్న ప్రధాని ఉంటే కరెంటు కోతలు ఉంటాయా అని ప్రశ్నించారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇవ్వాలని ఒకాయన ధర్నా చేస్తున్నారని, ఆయనకు నెత్తాకత్తా? అంటూ పరోక్షంగా రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్రంలో కరెంటు వినియోగం పెరిగిందని, లోడ్‌ పెరగడంతో గ్రిడ్‌లైన్స్‌పై సైకిల్స్‌ను మెయింటెయిన్‌ చేసేందుకు పవర్‌ కట్‌ జరిగిందని చెప్పారు. విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడానని, ఆ సమస్యను పరిష్కరించామని, ఇకపై ఒక్క నిమిషం కూడా కరెంటు పోదని, పోనివ్వమని తెలిపారు. నాడు చంద్రబాబు ఇంకుడు గుంతలంటే, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బొంకుడు గుంతలు తవ్వారని విమర్శించారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో కృష్ణా, గోదావరి నీళ్లు తాగుతున్నారని చెప్పారు. నేడు కాల్వల్లో కాదని, వాగుల్లో కూడా నీరు పారుతుందని.. రేపు ఎన్నికల్లో ఓట్లు కూడా అలాగే పారతాయని కేసీఆర్‌ జోస్యం చెప్పారు.

కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: కేసీఆర్‌

కల్తీ విత్తనాలతో రైతులకు జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అందుకే కల్తీ విత్తనాలను విక్రయించే దుర్మార్గులను కఠినంగా శిక్షించేందుకు పీడీ యాక్టులు కూడా నమోదు చేస్తున్నామని చెప్పారు. రైతులను మోసం చేసినవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించకూడదనే ఉద్దేశంతోనే పీడీ యాక్టును రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, ఎల్గనమోని అంజయ్యలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నకిలీ విత్తనాల దుర్మార్గం మరీ ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ‘సమీకృత వ్యవసాయ మార్కెట్లు’ నిర్మిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం నిజామాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌లో కొన్నిచోట్ల నిర్మాణమవుతున్నాయని తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లకు హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌ ఆదర్శమన్నారు. నిజాం హయాంలో నిర్మించిన ఈ మార్కెట్‌ 110-120 ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉందని కొనియాడారు. మనం తినే ఆహార పదార్థాలు భూమి నుంచి రెండున్నర అడుగుల ఎత్తులో ఉంటే బ్యాక్టీరియా దరిచేరకుండా ఉంటుందని, మోండా మార్కెట్‌ నిర్మాణంలో అలాంటి ప్రమాణాలు పాటించారని కేసీఆర్‌ అన్నారు. అంతే శాస్త్రీయంగా, సంస్కారవంతంగా రాష్ట్రమంతటా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు నిర్మిస్తామని తెలిపారు.

కూల్చుతామంటే జనం ఊరుకోరు

సచివాలయానికి అంబ్కేదర్‌ పేరు పెట్టుకున్నామని, పార్లమెంట్‌కు కూడా పెట్టాలని తాము డిమాండ్‌ చేశామని కేసీఆర్‌ అన్నారు. ఈ మాట చెబుతున్న సందర్భంలో సభలో ఓ ఎమ్మెల్యే ‘సచివాలయం గుమ్మటాలు కూల్చుతారంట’ అని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దానికి స్పందిస్తూ.. కూల్చేస్తాం, పేల్చేస్తామంటే ప్రజలు ఊరుకోబోరన్నారు. కాళ్లు చేతులు విరిచేస్తారని వ్యాఖ్యానించారు. అలా మాట్లాడేవారిని ప్రజలే చూసుకుంటారన్నారు. ఉద్యోగులకు ఇంకా జీతాలు పెంచుతామని, పీఆర్సీ వేసుకుంటామని చెప్పారు. విద్యార్థుల డైట్‌ చార్జీలను పెంచుతామని, 2-3 రోజుల్లో జీవో ఇస్తామని అన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత సభ ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది. అనంతరం శాసన సభ నిరవధికంగా వాయిదా పడింది. మొత్తం రెండుగంటల పాటు సీఎం ప్రసంగం సాగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments