పెరంబూర్(చెన్నై): జ్వరం లక్షణాలున్న వారు మూడు రోజులు క్వారంటైన్‌లో ఉంటే మంచిదని, బహిరంగ ప్రాంతాల్లో మాస్క్ ధరించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం విజ్ఞప్తి చేశారు. స్థానిక నందనం ప్రభుత్వ మోడల్ మహోన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థులకు దంత సంరక్షణ పథకం ‘పున్నగై’ను మంత్రి ఎం.సుబ్రమణ్యం, మంత్రి అన్బిల్ మహేష్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ‘పున్నగై’ పథకం ద్వారా పాఠశాలల విద్యార్థులకు దంతపరీక్షలు నిర్వహించనున్నామన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6, 7, 8 తరగతులకు చెందిన 4 లక్షల మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాప్తి చెందుతున్న హెచ్3ఎన్2 రకం వైరస్ వల్ల ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ వైరస్ బారిన పడిన వారు నాలుగురోజుల్లో ఆరోగ్యవంతులవుతారన్నారు.