ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ చార్జిషీట్ దాఖలు చేసిన మరుసటి రోజే ఈడీ అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. దీనిని రౌజ్ అవెన్యూ కోర్టులోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ముందుంచింది. కేవలం ఇండో స్పిరిట్స్ లిమిటెడ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రపై మాత్రమే ఈడీ చార్జిషీటు వేసింది. ఇందులో సమీర్‌ను ఏ1గా చేర్చగా, ఆయన నియంత్రణలో ఉన్న నాలుగు కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చింది. చార్జిషీటు దాదాపు 3 వేల పేజీలు ఉన్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
దాదాపు రూ.291 కోట్ల లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. ప్రస్తుతానికి సమీర్ మహేంద్రు పాత్రపై దర్యాప్తు పూర్తయిందని, ఇతరులు, ఇతర కంపెనీల పాత్ర, లావాదేవీలపై తదుపరి దర్యాప్తు జరుగుతుందని ఈడీ న్యాయవాదులు పేర్కొన్నారు. త్వరలో వాటికి అనుబంధ చార్జిషీట్‌ను దాఖలు చేస్తామని తెలిపారు. అయితే ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఏ1గా పేర్కొన్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియా పేరు ఈడీ చార్జిషీట్‌లోనూ లేకపోవడం గమనార్హం. శుక్రవారం సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లోనూ సిసోడియా పేరు లేని విషయం తెలిసిందే. కాగా, సమీర్ మహేంద్రు కంపెనీల ఉద్యోగులను విచారణ పేరిట ఈడీ అధికారులు పిలిచి హింసించారని న్యాయవాదులు కోర్టుకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉద్యోగులు భయాందోళనతో ఉన్నారని, ఇప్పటివరకు దాదాపు 30 మంది రాజీనామా చేశారని తెలిపారు.
అంతా మోదీ పర్యవేక్షణలోనే.. : కేజ్రీవాల్
డిప్యూటీ సీఎం మనీష్‌పై కేసును ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, దీనిపై ఇటీవల సీబీఐ, ఈడీ డైరెక్టర్లను కలిశారని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శనివారం ఆప్ 10వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక విధంగా మనీష్‌కు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందన్నారు.