న్యూయార్క్: పీఎం మోదీ నేతృత్వంలోని భారతదేశం.. పాకిస్తాన్ కవ్వింపులకు సైనిక శక్తితో సమాధానం చెప్పే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు తమ ‘యాన్యువల్ థ్రెట్ అసె్‌సమెంట్’లో పేర్కొన్నాయి. అమెరికా జాతీయ భద్రతకు సంబంధించి ‘డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్’ ఏటా ఇచ్చే నివేదిక ఇది. వివిధ దేశాల మధ్య నెలకొనే ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఆయా ప్రాంతాలకే పరిమితం కాక ప్రపంచంలోని ఇతరదేశాలపైనా పడే ప్రమా దం ఉంటే ఆ విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావిస్తారు. ఈ క్రమంలోనే ఈ నివేదికలో ఇండియా-చైనా, ఇండియా-పాకిస్థాన్ ఘర్షణల గురించి కూడా ప్రస్తావించారు. ‘‘భారత్-చైనా దేశాలు సరిహద్దు చర్చల్లో పాల్గొంటున్నప్పటికీ.. 2020లో (గల్వాన్‌లోయలో) జరిగిన ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాల నడుమ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి.
ఆ రెండు అణ్వాయుధ శక్తుల నడుమ సాయుధ ఘర్షణ జరిగే ప్రమాదం పెరిగింది. దాని ప్రభావం అమెరికా ప్రజలపైనా, ప్రయోజనాలపైనా ప్రత్యక్షంగా ఉండే ముప్పు ఉంది. ఈ విషయంలో అమెరికా జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది’’ అని పేర్కొన్నారు. అలాగే, పాక్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ పాటించాలని న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ 2021 మొదట్లో తీసుకున్న నిర్ణయమే బహుశా అక్కడ ప్రస్తుత ప్రశాంత పరిస్థితికి కారణం. అయితే.. భారత వ్యతిరేక ఉగ్రవాద శక్తులకు మద్దతిచ్చే సుదీర్ఘ చరిత్ర పాకిస్తాన్‌కు ఉంది. కానీ, గతం తో పోలిస్తే పాక్ చేసే ఉత్తుత్తి, నిజమైన కవ్వింపులకు మోదీ నేతృత్వంలోని భారతదేశం సైనిక శక్తితో బదులిచ్చే అవకాశాలు ఎక్కువ. కశ్మీర్ లో హింసాత్మక ఆందోళనలు, భారత్‌లో ఉగ్రదాడి వంటివి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యే ప్రమాదం ఉంది’’ అని నివేదికలో పేర్కొన్నారు.