Sunday, March 23, 2025
spot_img
HomeANDHRA PRADESHటీడీపీ వస్తే.. చేనేతపై పన్ను తీసేస్తాం

టీడీపీ వస్తే.. చేనేతపై పన్ను తీసేస్తాం

రాయచోటి: టీడీపీ అధికారంలోకి రాగానే నేతన్న వెన్ను విరుస్తున్న చేనేతపై జీఎస్టీని ఎత్తేస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రకటించారు. అవసరమైతే దానికయ్యే సొమ్మును రాష్ట్రప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా 39వ రోజు గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని ఎనుములవారిపల్లెలో చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత వారితో కలిసి లోకేశ్‌ రాట్నం తిప్పి నూలు వడికారు. పలువురు చేనేత కార్మికులు తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయన స్పందిస్తూ.. ‘నేతన్న కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే పవర్‌లూం వస్త్రాలు, చేనేత వస్త్రాలకు తేడా తెలిసేలా లేబిలింగ్‌ చేయాలి. చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్‌ క్రియేట్‌ చేస్తామని జగన్‌రెడ్డి మోసం చేశాడు. తెలుగుదేశం హయాంలో 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు 1.11లక్షల మందికి రూ.2 వేల చొప్పున పింఛన్‌ ఇచ్చాం. రూ.111 కోట్లు చేనేత రుణాలు మాఫీ చేశాం. యార్న్‌ సబ్సిడీ, కలర్‌ సబ్సిడీని జగన్‌ ప్రభుత్వం ఎత్తేసింది.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నేతన్న నేస్తం కూడా పెద్ద మోసం. నేత కార్మికులందరికీ నేతన్న నేస్తం ఇస్తామన్న జగన్‌ ఇప్పుడు సొంత మగ్గాలు ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు. మదనపల్లెలో 20 వేల మంది చేనేత కార్మికులు ఉంటే కేవలం 4 వేల మందికే అందుతోంది. చేనేత కార్మికులకు గ్రామాల్లో హౌస్‌కమ్‌ వర్కింగ్‌ షెడ్‌ పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఇస్తాం. పట్టణాల్లో అంత స్థలం ఉండదు కాబట్టి నాణ్యమైన టిడ్కో ఇళ్లు కట్టించి కామన్‌ వర్కింగ్‌ షెడ్లు నిర్మిస్తాం. పవర్‌లూమ్‌కు 500యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందజేస్తాం. చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తామని గతంలో ప్రకటించిన మాటకే కట్టుబడి ఉంటాం’ అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నానని.. గెలిస్తే చేనేత సమస్యలపై పోరాడతానని చెప్పారు. చేనేత సామాజిక వర్గం తనను దత్తత తీసుకోవాలని కోరారు. ఎనుములవారిపల్లెలో మైనారిటీలతో జరిగిన ముఖాముఖిలో లోకేశ్‌ మాట్లాడుతూ.. దేశంలోనే మొదటి మైనారిటీ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసింది టీడీపీ ప్రభుత్వమేనని.. దానిని జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని చెప్పారు. వక్ఫ్‌ ఆస్తులను వైసీపీ నేతలు కబ్జా చేస్తుంటే ఆ పార్టీకి చెందిన మైనారిటీ ప్రజాప్రతినిధులు కనీసం ప్రశ్నించడం లేదన్నారు. మైనారిటీల సభలో జైహింద్‌ అన్నానంటూ వైసీపీ వాళ్లు ట్రోల్‌ చేస్తున్నారని.. ఈ దేశంలో పుట్టి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యమైన మైనారిటీలు జైహింద్‌ అంటే తప్పేంటని ప్రశ్నించారు. కాగా పూలవాండ్లపల్లెలో చిత్తూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ప్రతినిధులు, రాష్ట్ర వాల్మీకి సంఘ ప్రతినిధులు లోకేశ్‌ను కలిశారు.

లోకేశ్‌ ‘ఫిష్‌’ సెల్ఫీ

చిన్నతిప్పసముద్రం-2లో లోకేశ్‌ నడుస్తుండగా మూతపడిన ఫిష్‌ ఆంధ్ర దుకాణం కనిపించింది. దీనివద్ద నిలబడి ఆయన మాట్లాడుతూ.. ‘జగన్‌ పెట్టిన కంపెనీ చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఈ రోజు ఆయన బ్రెయిన్‌ చైల్డ్‌ స్కీమ్‌ ఫిష్‌ ఆంధ్ర చూశాను. ఆయన తెచ్చిన ఫిష్‌ ఆంధ్రకు తాళాలు పడి ‘ఫినిష్‌ ఆంధ్ర’ అయిపోయింది. అభివృద్ధి అంటే రంగులు వేసుకోవడం కాదు జగన్‌రెడ్డీ..’ అని ఎద్దేవా చేశారు. ఫిష్‌ ఆంధ్ర ఎదుట సెల్ఫీ దిగారు.

యువగళం 500 కిలోమీటర్లు

లోకేశ్‌ ప్రారంభించిన యువగళం పాదయాత్ర గురువారం 500 కిలోమీటర్లను అధిగమించింది. మదనపల్లె నియోజకవర్గం చిన్నతిప్పసముద్రం-2 వద్ద ఈ మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో టమోటా రైతుల కోసం టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటుకు లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. 39వ రోజు ఆయన 13 కి.మీ నడిచారు. దీంతో మొత్తం 510.5 కి.మీ పాదయాత్ర పూర్తయింది.

అరాచక పాలన అంతమొందించేందుకే

రాష్ట్రంలో జగన్‌రెడ్డి అరాచకపాలన అంతమొందించడమే లక్ష్యంగా కుప్పంలో జనవరి 27న నేను ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఈ రోజు మదనపల్లి రూరల్‌ చిన్నతిప్పసముద్రం వద్ద 500 కి.మీ మైలురాయిని చేరుకుంది. కోట్లాది ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్న యువగళం.. సైకో ప్రభుత్వాన్ని గద్దెదించేవరకు విశ్రమించబోదని మాటిస్తున్నాను.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments