రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డీపేటమండలం ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులకు సేవలందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట సీహెచ్ సీ, రికార్డ్స్ ను కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని మందులు అందించే గది, రక్త పరీక్షల చేసే ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్ రూం ను, ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు బెడ్స్ గదిని పరిశీలించారు. దవాఖాన లో వైద్యులు, సిబ్బంది ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, జనరల్ వార్డ్ గది కిటికీలకు మస్కిటో నెట్ ఏర్పాటు చేయించాలని జనరేటర్ వినియోగంలోకి తీసుకురావాలని, ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు బెడ్స్ గది పనులను వేగంగా పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకురావాలని సీహెచ్ సీ ఇంచార్జీ డాక్టర్ బాబుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇక్కడ డాక్టర్లు రఘు, ప్రదీప్, సీహెచ్ సీ ఇంఛార్జి డాక్టర్ స్రవంతి తదితరులు పాల్గొన్నారు.