పౌరులపై, జర్నలిస్టులపై అక్రమ నిర్బంధం, అక్రమ కేసులు
ఊపా చట్టాన్ని రద్దు చేయాలి, ఎన్ఐఎ ను ఎత్తివేయాలి
కరీంనగర్ రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దశాబ్ద పాలనలో ప్రజాస్వామిక విలువలు, హక్కులు విధ్వంసం అయ్యాయని పౌరులపై అక్రమ నిర్బంధం మరింత పెరిగి పోయిందని హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు మండిపడ్డాయి. బుధవారం కరీంనగర్ లోని ప్రెస్ భవన్ లో పౌర హక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 23 ప్రజా సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఊపా చట్టాన్ని రద్దు చేయాలని, ఎన్ఐఎ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దశాబ్ద పాలనలో వైఫల్యాలను వారు ఎండగట్టారు.
దేశంలో ఉపా చట్టంతో, యన్.ఐ.ఏ.దాడులతో పాటు జర్నలిస్టులు, మేదావులు, ప్రజా స్వామిక వాదులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని యన్.ఐ.ఎ ను పూర్తిగా రద్దు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. రానున్న ఎన్నికల సందర్బంగా ఓట్ల కోసం వచ్చే రాజకీయ పార్టీలను నాయకులను ఉపా చట్టాన్ని యన్.ఐ.ఎ ను రద్దు చేయాలన్న డిమాండ్ల ను వారి మానిపేస్టోలో పెట్టాలని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నుండి మంచిర్యాల వరకు ఉన్న గోదావరి పరివాహక ప్రాంతాలలో ఎన్నికల నేపథ్యంలో సాయుధ పోలీసుల కూంబింగులను వెంటనే నిలిపి వేయాలని, తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్దంగా నిర్వహిస్తున్న కార్డెన్ సెర్చులను అక్రమ అరెస్టులను నిలిపి వేయాలన్నారు. గత పది ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా 3 అక్టోబర్ 2023 న న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురా కాయస్త, హెచ్ఆర్ హెడ్ తో పాటు 85 మంది జర్నలిస్టుల పై ఉపా కేసు నమోదు చేయడం పై, ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయి పై ఉపా కేసు పై కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో చర్చించి ఆకేసుల ఎత్తివేత కు పోరాటం చేయాలని తీర్మానం చేశారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు సిపిఐ, సిపియం, కాంగ్రేస్, బియస్పి, జైబీంఆర్మీ, విరసం ఆరసం, కె.యన్.పి.యస్. 23 ప్రజా సంఘాలు, టిపిఎఫ్, దళిత లిబరెషన్ ఫ్రంట్, రైతుసంఘం, జర్నలిస్టుసంఘాలు, ఆదివాసి తుడుం దెబ్బ, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి యన్.నారాయణ రావు, సహయ కార్యదర్శి మాదన కుమార స్వామి, రౌండ్ టేబుల్ కు అధ్యక్షతగా పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి రాజగోపాల్, వివిధ పార్టీల నాయకులు, సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ జన సమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విరసం బాలసాని రాజయ్య, టిపిఎఫ్ మల్లాగౌడ్, అరసం లెనిన్, కె.యన్.పి.యస్. అబినవ్, దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడీ సుదర్శన్, సిపియం యంవి రెడ్డి , కాంగ్రేస్ జి.ప్రభాకర్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జోజి రెడ్డి, టిజెఎసి చైర్మన్ వెంకటమల్లయ్య, బిఎస్పీ కరీంనగర్ సంజయ్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఉప కులాల ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.