కాల్ రికార్డే సాక్ష్యం అంటున్న అమ్మాయి తండ్రి..
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని, కొత్తపల్లి గ్రామానికి చెందిన కొక్కుల శ్రీ రాములు, తమ కూతురు ప్రేమ పేరుతో బలవంతపు వివాహానికి గురి అయిందని, తమకు న్యాయం కావాలని మీడియా ముందుకు వచ్చి తమ బాధను వెలిబుచ్చారు. వివరాల్లోకి వెళ్తే, ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ పరీక్షలు కోసం, గత కొద్ది కాలంగా హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటోంది. గత నెల 24న ఇంటికి వచ్చినప్పుడు, తన ప్రేమ విషయం ఇంట్లో వాళ్లకు తెలిపింది. ఈ నెల జరగనున్న ఎన్నికల సందర్భంగా ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడుదాం అని సముదాయించి తండ్రి పంపాడు. తిరిగి హైదరాబాద్ వెళ్లి మే 6న, తనది కాని ఎదో నెంబర్ నుంచి మళ్ళీ ఫోన్ చేసి, నన్ను ఇక్కడ బలవంత పెడుతున్నారు, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, మీరు లేకుండా నేను చేసుకోలేను అని చెప్పింది. అదే కాల్ లో “ఉన్నఫళంగా వారి పెళ్ళికి ఒప్ప్పుకోవాలి అని లేదా ఇప్పుడే ఆర్య సమాజ్ లో పెళ్లి చేస్తాం అని, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులు తనను బలవంత పెడుతున్నారని ఏడుస్తూ చెప్పింది. దానికి తండ్రి శ్రీ రాములు ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. ఇలా ఒకేసారి నిర్ణయం తీసుకోవడం మాకు కష్టం అని తనకు ఒక పది రోజుల గడువు కావాలని మొదట అడిగినా, చివరకు కనీసం రెండు రోజుల గడువు అయినా కావాలని కోరాడు. అదే రోజు మళ్ళీ ఫోన్ చెయ్యగా, స్విచ్ ఆఫ్ రావడంతో, ఆందోళనతో తండ్రి కుటుంబంతో సహా హైదరాబాద్ బయలు దేరాడు.
పలుమార్లు ఫోన్ చేయగా చివరగా ఫోన్ కలిసింది. అప్పుడు తనని హైదరాబాద్ లో ఉన్న పిన్ని ఇంటికి రమ్మని కోరగా, అదే రాత్రి తొమ్మిదింటికి వచ్చి కలిసింది. అక్కడ తర్వాత రెండు మూడు రోజులు మాట్లాడటానికి వాళ్ళను పిలిపించాల్సిందిగా ఎంత అడిగినా ఎదో కోల్పోయినట్టు దిగాలుగా ఉంది తప్ప సమాధానం చెప్పలేదు. మే 9వ తేదీన అక్కడ నుంచి హాస్టలుకు బయలుదేరింది. అదే రోజు సాయంత్రం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి, మీ కూతురు మే 6వ తేదీన పెళ్లి చేసుకుంది అని, మీరు రేపు పొద్దున్న వచ్చి కలవండి అనే ఫోన్ వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడా కూడా తలిదండ్రులు ప్రేమ పెళ్ళిని వ్యతిరేకించలేదు. కేవలం రెండు రోజుల గడువు మాత్రమే కోరారు. నిజానికి ఆరవ తేదీన తన తండ్రికి పెళ్లి విషయంలో ఎదో ఒకటి చెప్పాలి అని, తనను బలవంత పెడుతున్నారు అని అన్న వెంటనే యువకుని కుటుంబ సభ్యులు తీసుకెళ్లి పెళ్లి చేసారు. తండ్రి కోరినట్టు కనీసం రెండు రోజుల గడువు అయినా ఇవ్వకుండా, అదే రోజు పెళ్ళికి బలవంతం చేసిన ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల మీద విచారణ చేపట్టి, చట్ట పరమైన చర్య తీసుకోవాలి అని ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను, ప్రజా ప్రతినిధులను, తలిదండ్రులు వేడుకుంటున్నారు. ఇప్పటికి కూడా తన కూతురు మీద కానీ, ఆ వ్యక్తి మీద కానీ తనకు ఎలాంటి కోపం లేదని, కానీ ఇంత హడావిడిగా, కేవలం రెండు రోజుల గడువు కూడా ఇవ్వకుండా అదే రోజు తమ కూతురుకి పెళ్లి చేయడం ఎంతవరకు సమంజసం అని తలిదండ్రులు అంటున్నారు. తాను ప్రేమ పెళ్లిళ్లకు వ్యతిరేకం కాదని, కేవలం ఈ తతంగం అంత చూస్తుంటే, పలు అనుమానాలకు తావిస్తోంది అని, తన కూతురు భద్రత గురించి తమకు ఆందోళనగా ఉందని, తలిదండ్రులు ప్రెస్ మీట్ పెట్టి అందరికి తెలియపరిచారు…