డిస్ట్రిబ్యూటర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి దిల్ రాజు (Dil Raju). టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. పలు కారణాల వల్ల ఆయన కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు.
దిల్ రాజు నిర్మాతగా రాణిస్తూనే డిస్ట్రిబ్యూటర్‌గా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఆయనకు 2017 తీపితో పాటు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ ఏడాది ఆయన నుంచి ఆరు చిత్రాలు వచ్చాయి. ‘శతమానం భవతి’, ‘నేను లోకల్’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘ఫిదా’, ‘రాజా ది గ్రేట్’, ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ వంటి సినిమాలను నిర్మించారు. ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. ‘ఫిదా’ అయితే రెండింతల లాభాన్ని తీసుకువచ్చింది. డిస్ట్రిబ్యూటర్‌గా మాత్రం కొన్ని మూవీస్ భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఈ నష్టాలపై దిల్ రాజు తాజాగా స్పందించారు. ‘‘స్పైడర్, అజ్ఞాత వాసి సినిమాల నైజాం రైట్స్‌ను నేను ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేశాను. ఈ చిత్రాలతో భారీగా నష్టం వచ్చింది. నేను కాబట్టి వాటిని తట్టుకున్నాను. ఆ ఏడాది ఆరు హిట్స్ కొట్టడంతో నిలదొక్కుకున్నాను. వేరే వాళ్లు అయితే ఇండస్ట్రీని వదిలివెళ్లేవారు’’ అని దిల్ రాజు చెప్పారు. మహేశ్ బాబుతో తనకు ఎటువంటి విభేదాలు లేవని రాజు పేర్కొన్నారు. మహేశ్ సున్నిత మనస్కుడు కాబట్టి ఎవరు ఏదైనా చెబితే నిజమేనని నమ్మి ఉండొచ్చన్నారు. ఒక్కసారి కూర్చొని మాట్లడితే సరిపోతుందని చెప్పారు. కాంబినేషన్స్‌ను సెట్ చేస్తే నిర్మాతకు నష్టమన్నారు. కథ ఉంటేనే ఏ హీరో వద్దకైనా వెళ్లి డేట్స్ అడుగుతానన్నారు. ‘వారసుడు’ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.